Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జులై నాలుగున ఇందిరా పార్కువద్ద ధర్నా ఐద్వా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమం చేపట్టక తప్పటం లేదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అరుణ జ్యోతి, మల్లు లక్ష్మి ఉపాధ్యక్షులు శశికళ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు నెల్ల పాటు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మహిళా సమస్యలపై సర్వేలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ఉపాధి సమస్యలతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 2014లోనే కేసీఆర్ ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూం ఇస్తామని వాగ్దానం చేశారని గుర్తు చేశారు. కానీ.. నేటికీ ఆ పని పూర్తి కాలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో లక్షా90 వేల ఇండ్లను పూర్తి చేసినట్టుగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు అసెంబ్లీలో చెప్పారని గుర్తుచేశారు. కానీ..19వేల మంది లబ్దిదారులకు మాత్రమే ఇండ్లు ఇచ్చారని తెలిపారు. ఇంటి స్థలం ఉన్న వారికి మూడు లక్షలు ఇస్తామని ప్రకటించి ఆర్నెల్లయిందనీ, నేటికి ఒక్కరికి కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దీంతో పేదల సొంతింట కల కలగా నే మిగిలిపోయిందని తెలిపారు.57ఏండ్లు నిండిన వారు రాష్ట్రంలో 11లక్షలమంది ఆసరా పెన్షన్లకోసం దరఖాస్తు చేసుకున్నారనీ, వారికి ఇంత వరకు మంజూరు చేయదని పేర్కొన్నారు. అభయం హస్తం పథకంలో ఉన్న మహిళల డబ్బులు వారి అకౌంట్లో వేస్తామని చెప్పి, ఇంత వరకు వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు ఎదుర్కొం టున్న సమస్యల పరిష్కారం కోసం జూలై నాలుగున హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించ నున్నట్టు తెలిపారు.