Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముందే చెప్పిన 'నవతెలంగాణ'
- పేదల సొమ్ముతో కొన్న 'స్వగృహ' భూముల వేలం
- ప్రభుత్వానికి కాసుల పంట
- గజానికి రూ.21,400 పలికిన వేలం ధర
నవతెలంగాణ - కరీంనగర్
అనుకున్నట్టుగానే అంగారిక టౌన్షిప్లో రియల్టర్లు పాగా వేశారు. సర్కారు వారి పాటలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ప్రభుత్వానికి ఆదాయం దండీగా సమకూరగా.. సామాన్యుడి ఇంటి కల కలగానే మిగిలింది. ప్రభుత్వం అశించిన దానికంటే నాలుగింతల ధర వచ్చింది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదల సొంతింటి కల కోసం లబ్దిదారుల నుంచి కొంత మొత్తం సేకరించి కొనుగోలు చేసిన భూమిని ఇప్పుడు ప్రభుత్వం అమ్ముకుంటోంది. అంగారిక టౌన్షిప్లో రియల్టర్ల కన్నుపడిందని 'నవతెలంగాణ' ముందే చెప్పింది. అయితే, సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వాసర గార్డెన్లో నిర్వహించిన వేలం పాటలో రియల్టర్లు ఎక్కువ మొత్తంగా ప్లాట్లను హస్తగతం చేసుకున్నారు. ప్రభుత్వానికి కాసుల వర్షం కురింసింది. ఈ వేలం పాటలో స్థానిక రియల్టర్లతోపాటు పలు జిల్లాల రియల్టర్లు పాల్గొన్నారు.
నైరాశ్యంలో లబ్దిదారులు ..
సుమారు 15ఏండ్ల కిందట వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి హయాంలో రాజీవ్ గృహకల్ప, రాజీవ్‌స్వగృహ పథకాలు చేపట్టారు. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని చింతకుంట గ్రామపరిధిలో రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్ల నిర్మాణం పూర్తిచేసి లబ్దిదారులకు అందించారు. అనంతరం స్వగృహ లబ్దిదారుల కోసం తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ గ్రామంలో ప్రభుత్వానికి సంబంధించిన 23ఎకరాలు కేటాయించారు. అయితే, లబ్దిదారుల సంఖ్య అనూహ్యంగా 7524కు పెరిగింది. దీంతో ఆ స్థలం సరిపోదని మరో 66ఎకరాల అసైన్డ్ భూమి సేకరించారు. ఆ సమయంలో లబ్దిదారుల ఒక్కొక్కరి నుంచి రూ.5250 వసూలు చేశారు. దీంతో సుమారు రూ.4కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇందులో రూ.2కోట్లు ఖర్చు చేసి 66ఎకరాల స్థల సేకరణ చేశారు. అయితే, ఇండ్ల నిర్మాణం చేయలేదు. లబ్దిదారులకు ఇంటి స్థలమూ ఇవ్వలేదు. ఏండ్ల తరబడి లబ్దిదారులు అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేశారు. సమస్య పరిష్కరించకపోగా ప్రభుత్వం మరింత జఠిలం చేసింది. జిల్లా కలెక్టరేట్లో ఉన్న కార్యాలయాన్ని ఎత్తివేసింది. స్వగృహ స్థలంలోనే తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం అది కూడా ఎత్తివేసింది. చివరగా గృహనిర్మాణ సంస్థలో విలీనం చేసింది. చివరకు ఆ సంస్థను సైతం మూసివేసింది. లబ్దిదారులు ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులకు పేదలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమకు స్థలమైనా కేటాయించాలని, లేని పక్షంలో డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో సుమారు సగం మంది లబ్దిదారులకు డబ్బులు వాపసు చేసినట్టు సమాచారం. మిగిలినవారు తమకు ప్రభుత్వం ఇచ్చిన హమీ మేరకు స్థలం కేటాయించడంతోపాటు ఇల్ల్లు కట్టించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఆ భూముల వేలం పాట రద్దు చేయాలని ఇటీవల కోర్టుకు కూడా వెళ్లారు. కోర్టు తుది తీర్పు రాకముందే.. పేదల ప్రభుత్వం వినతిని పట్టించుకోకుండా వేలం పాట నిర్వహించింది.
సర్కారి వారి పాట రూ.21400
ప్రభుత్వం 99ఎకరాల స్థలాన్ని 819ప్లాట్లుగా మార్చింది. దశల వారీగా వేలం వేయడానికి నిర్ణయించింది. ఇందులో భాగంగా సోమవారం 237ప్లాట్లకు వేలం నిర్వహించారు. ఈ వేలంలో 50మంది పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వమే స్వయంగా నిర్వహిస్తున్న వేలం పాటలకు ప్రత్యేకమైన నిబంధనలంటూ ఏమీలేవు. అందువల్ల రూ.10వేల చొప్పున ఒక్కరు అనేక డీడీలు చెల్లించి పాల్గొనే అవకాశం కల్పించింది. దీంతో రియల్టర్లకు ఈ అవకాశం కలిసి వచ్చింది. అయితే నివాస స్థలానికి చదరపు గజానికి రూ.6000 నిర్ణయించగా వేలంలో రూ.10వేల నుంచి రూ.18500 వరకు పలికింది. అలాగే, కమర్షియల్ స్థలానికి ప్రభుత్వం చదరపు గజానికి రూ.8వేలు నిర్ణయించగా రూ.అత్యధికంగా వేలంలో రూ.21400పలికింది. ఈ వేలం పాటలో రియల్టర్లు పాల్గొనడంతో సామాన్యులకు ప్లాట్లు దక్కలేవని, వాటి ధరను సైతం అమాంతంగా పెంచి మొత్తం హస్తగతం చేసుకున్నారని అక్కడికి వచ్చిన సామాన్యులు ఆరోపించారు. 788 టోకెన్ నంబర్ వ్యక్తి చదరపు గజానికి రూ.13వేల చొప్పున వేలం పాడి 1040.67 చదరపు గజాలను రూ.13528710 దక్కించుకున్నాడు. టోకెన్ నంబరు. 754 వ్యక్తి రూ.1024.94 చదరపు గజాలను, రూ.18వేల చొప్పున వేలం పాడి రూ.1,84,48920కు దక్కించుకున్నాడు. టోకెన్ నం. 397 గల వ్యక్తి చదరపు గజానికి రూ.21400 చొప్పున వేలం పాడి 338.74 చదరపు గజాలను రూ.7249036కు దక్కించుకున్నాడు.