Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2,558 మందికి ప్రయోజనం :మంత్రి సబితా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ పరస్పర బదిలీల వల్ల 2,558 మందికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లో మంత్రి తన కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. పరస్పర బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని ఆదేశించారు.
కాంట్రాక్టు జేఎల్ క్రమబద్ధీకరణ జాబితాను రెండ్రోజుల్లో పంపండి: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశం
జూనియర్ కాలేజీల్లో బోధిస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణకు సంబంధించిన జాబితాను రెండు రోజుల్లో విద్యాశాఖకు అందజేయాలని ఇంటర్ విద్యా కమిషనర్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లో కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణపై మంత్రి సమీక్ష చేపట్టారు. కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో జాప్యం సరిగాదన్నారు. యూనివర్సిటీల గుర్తింపు, కాంట్రాక్ట్ జేఎల్‌గా చేరినప్పటి వయస్సు విషయంలో మినహాయింపుపై ఎలాంటి సమస్యలు లేకుండా పారదర్శకతతో కూడిన జాబితాను అందించాలని సూచించారు. వొకేషనల్ విభాగంలో జీవో నెంబర్ 12 కాకుండా కాంట్రాక్టు అధ్యాపకులు నియామకమైన జీవో నెంబర్ 101, 109, 483ల ప్రకారం నియామకాలు జరిగినప్పుడు ఉన్న అర్హతల ప్రకారమే జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర విభజన సమయంలో కమల్‌నాథన్ కమిటీ వొకేషనల్ విభాగంలో 842 పోస్టులను తెలంగాణకు కేటాయించిందని గుర్తు చేశారు. వాటిని గుర్తించి కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణలో నాన్ శాంక్షన్ పోస్టుల సమస్య పరిష్కరించాలని సూచించారు.
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం : గాదె వెంకన్న
క్రమబద్ధీకరణ ప్రక్రియలో కాంట్రాక్ట్ లెక్చరర్లకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గాదె వెంకన్న ధన్యవాదాలు తెలిపారు. రివ్యూ మీటింగ్‌లో పలు కీలక సూచనలు చేశామన్నారు.