Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టర్ ఆవిష్కరించిన తెలంగాణ రైతు సంఘం నేతలు
- దరఖాస్తులను పరిశీలించి పట్టాలివ్వాలని డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఇప్పటికే పోడు రైతులు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి, వారికి పట్టాల్వివాలని కోరింది. ఈమేరకు సోమవారం హైదరాబాద్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఈనెల 22న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో జరగనున్న 'పోడు భూములపై రాష్ట్ర సదస్సు'కు సంబంధించిన పోస్టర్ను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్, ఏఐకెేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల పట్టాల కోసం ధరఖాస్తులు చేసుకున్న వారందరికీ పదిహేను రోజుల్లో పట్టాలు ఇస్తానని ప్రకటించడంతో వేలాది మంది రైతులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారని గుర్తు చేశారు. ధరఖాస్తు చేసుకుని నెల రోజులు గడుస్తున్నా వాటిని ఇప్పటికీ ఇవ్వలేదని చెప్పారు. సాగు చేసుకుంటున్న పోడు రైతులపై ఫారెస్టు అధికారులు, పోలీసులు దాడులు చేస్తూ...అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ సమస్యను పరిష్కరిస్తానంటూ నిరంతరం ప్రచారం చేయడమే తప్ప ఒక ఎకరాకు పట్టా ఇచ్చింది లేదన్నారు. కార్పొరేట్ సంస్థలకు, బడా భూస్వాములకు లాభం కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదనీ, అటవీసంపదను వారికి ధారదత్తం చేసేందుకు లోపాయకారి ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శించారు. గతంలో జిందాల్ కంపెనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి రైతులు ఒప్పందాన్ని రద్దు చేయించారని తెలిపారు. పోడు భూముల సమస్యలపై చర్చించి, భవిష్యత్తు కార్యక్రమాలు రూపొందించేందుకు జరుగుతున్న రాష్ట్రసదస్సును జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావు, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ తదితరులు పాల్గొన్నారు.