Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎనిమిది వాట్సాప్ గ్రూపుల ద్వారా...
- ప్రధాన సూత్రధారి మధుసూదన్
- 56 మంది నిందితుల్లో 8 మంది వాట్సప్ అడ్మిన్ల కోసం గాలింపు
- డిఫెన్స్ అకాడమీల పాత్రలపై నిశితంగా ఆరా
- రిమాండ్ రిపోర్ట్‌లో దర్యాప్తు అధికారుల వెల్లడి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంస రచన ఎనిమిది వాట్సాప్ గ్రూపుల ద్వారా జరిగింది. ఇందులో ప్రధాన సూత్రధారిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన మధుసూదన్ అనే వ్యక్తిని గుర్తించారు. అంతేగాక, ఎనిమిది వాట్సప్ గ్రూపుల అడ్మిన్ల కోసం సికింద్రాబాద్ రైల్వే పోలీసుల వేట కొనసాగుతున్నది. 'అగ్నిపథ్'కు వ్యతిరేకంగా గత శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దాదాపు రెండు వేల మందికి ఆర్మీ ఉద్యోగార్థులు జరిపిన నిరసన పెను విధ్వంసానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ విధ్వంసాన్ని నివారింటానికి రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్‌కు చెందిన దామోదర రాకేశ్ మృతి చెందగా.. మరో 15 మందికి పైగా ఆందోళనకారులు గాయాలపాలై చికిత్స పొందుతున్నారు. ఈ విధ్వంసంతో దాదాపు రూ. 30 కోట్లకు పైగా ఆస్థి నష్టం జరిగిందని అధికారులు తేల్చారు. ఈ కేసులో ఇప్పటి వరకు 56 మందిని నిందితులుగా పేర్కొన్న దర్యాప్తు అధికారులు 46 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిపై కఠినమైన రైల్వే చట్టాలను ప్రయోగించారు.
కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందిన మధుసూదన్ (30) అనే యువకుడిని అధికారులు ప్రధాన నిందితుడిగా (ఏ1) పేర్కొన్నారు. అలాగే, ఏ2 నుంచి ఏ13 వరకు నిందితులు పరారీలో ఉన్నారనీ, ఏ14 నుంచి ఏ56 వరకు నిందితులను అరెస్టు చేశామని అందులో వివరించారు. అలాగే, మొత్తం ఎనిమిది వాట్సప్ గ్రూపులను రూపొందించి వాటి ద్వారానే ఆందోళనకారులు నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చేలా పిలుపునిచ్చి విధ్వంస రచన సాగించారని పేర్కొన్నారు. ఈ వాట్సాప్ గ్రూపులు కొన్నింటిలో ఆందోళనాకారులు పెట్రోల్ సీసాలు, కర్రలను కూడా ధరించి వచ్చేలా సూచనలూ చేశారని వివరించారు. ఈ వాట్సప్ గ్రూపులలో 'చలో సికింద్రాబాద్' రైల్వే స్టేషన్ అనే గ్రూపు అడ్మిన్ రమేశ్‌ను కూడా అరెస్టు చేశామని పేర్కొన్నారు. మిగతా గ్రూపుల అడ్మిన్లు పట్టుబడితే విధ్వంస రచనకు సంబంధించి మరికొందరు పాత్రధారులను పట్టుకోగలమని వివరించారు. వాట్సప్ గ్రూపులకు సంబంధించి దాదాపు ఐదు వందల మంది వరకు ఈ కేసులో నిందితులుగా చేర్చే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.
మరోవైపు, ఏపీలోని నర్సారావుపేటకు చెందిన సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావును హైద్రాబాద్‌కు తీసుకొచ్చి విచారించటానికి దర్యాప్తు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా, ఈ విధ్వంసానికి కుట్ర పన్నినవారిలో ఆవుల సుబ్బారావు కూడా ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు పోలీసులు ఆయనను అరెస్టు చేసి విచారిస్తున్నారు. కాగా, విధ్వంస రచనకు పాల్పడటానికి కారణమైన వాట్సాప్ గ్రూపులలో ఆరుగురు అడ్మిన్లు హైదరాబాద్‌కు చెందినవారేనని దర్యాప్తు అధికారులు తేల్చారు. మిగతా నిందితుల కోసం సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ అనురాధ స్వీయ పర్యవేక్షణలో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్‌లలో ప్రత్యేక టీమ్‌లు గాలిస్తున్నాయి.