Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి దళిత కుటుంబానికీ దళితబంధు పథకాన్ని వర్తింపజేయాలని కెేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా హాలియా పట్టణ కేంద్రంలో నిర్వహించిన కేవీపీఎస్ జిల్లా మహాసభలో ఆయన మాట్లాడారు. సుమారు 19లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకం రెండు దఫాలుగా అమలు చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. గతంలో దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌బెడ్ రూం ఇండ్లను కేటాయిస్తామని మోసం చేసిన కేసీఆర్.. ఇప్పుడు కూడా అదే దారిలో నడిస్తే సహించబోమని హెచ్చరించారు. అణగారిన వర్గాల నుంచి దోచుకున్న సంపదను పేదలకు పంచిపెడితే పాలకుల సొమ్మేమీ పోదన్నారు. భూమిని జాతీయం చేయాలని అంబేద్కర్ కలలుగన్నారని, కమ్యూనిస్టులు దున్నేవానికి భూమి దక్కాలని భావించారని వివరించారు. ఈ రెండింటిలో ఏది జరిగినా దళితులకు మేలు జరిగేదని చెప్పారు. రాష్ట్రంలో 72 కులదురహంకార హత్యలు జరిగితే.. సీఎం కేసీఆర్, మోడీ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. దళిత, బలహీనవర్గాలపై అనేక దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మత విద్వేషాలను రెచ్చగొడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేసే దిశలో కుట్రకు తెరలేపిందన్నారు. మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుతోందని విమర్శించారు. దళితులకు, ఇతర వెనుకబడిన తరగతులకు హక్కులు సాధించి పెట్టిన రాజ్యాంగాన్ని కూడా బీజేప ప్రభుత్వం మార్చేందుకు కుట్ర చేస్తోందన్నారు. చట్టాలను పెద్దలకు చుట్టాలుగా మార్చిందని చెప్పారు.
చిన్నజీయర్ స్వామి కుల వ్యవస్థ ఉండాలని కోరుకోవడంలో అర్థమేంటని ప్రశ్నించారు. ఎవరి మతాలను వారు గౌరవించుకుంటే తప్పులేదు కానీ, ఇతర మతాలను కించపర్చడంతో సార్వభౌమత్వం దెబ్బతింటుందని చెప్పారు. విద్యను కూడా కాషాయీకరణ చేసేందుకు కేంద్రం అనేక చర్యలు చేపట్టిందన్నారు. దేశం కోసం చిన్న వయస్సులో ఉరితీయబడిన భగత్ సింగ్ జీవిత పాఠ్యాంశాన్ని తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి, వాటిని అమ్మేస్తున్నారన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడారు. కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను అధ్యక్షతన నిర్వహించిన మహాసభలో సూర్యాపేట జిల్లా కార్యదర్శి కోట గోపి, నల్లగొండ జిల్లా నాయకులు కుమ్మరి శంకర్, శంకర్‌నాయక్, గండమల్ల రాములు, శ్రీను, బొల్లు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.