Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
- నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట పెద్దఎత్తున ధర్నా
నవతెలంగాణ-కంఠేశ్వర్
మధ్యాహ్న భోజన కార్మికులకు పెంచిన వేతనం అమలు చేస్తూ ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించి కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి మాట్లాడారు. ఈ పథకంలో 18 ఏండ్ల నుంచి కార్మికులు పని చేస్తున్నా.. వీరికి ఎలాంటి గుర్తింపు లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీవో94 అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి కృషిని గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, కోడి గుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని, నిత్యావసర ధరలకు అనుగుణంగా స్లాబ్ రేటు విద్యార్థికి రూ.15 ఇవ్వాలని తెలిపారు.
కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, సామాజిక ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని, వంట గ్యాస్ ఉచితంగా ఇవ్వాలని, అసెంబ్లీలో ప్రకటించిన మూడు వేల వేతనం ఏప్రిల్ నెల నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించని ఎడల ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చామంతి లక్ష్మి, ఉపాధ్యక్షులు జక్కం సుజాత, సాయమ్మ. ప్రభావతి, సత్తేమ్మ, భాగ్య, మనోహర్, కార్మికులు పాల్గొన్నారు.