Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీచర్ల జీవితాలతో అధికారుల చెలగాటం
- తప్పుల తడకగా పరస్పర బదిలీలు
- అండర్‌టేకింగ్ ఇచ్చిన వారి పేర్లు గల్లంతు
- వందలాది ఉపాధ్యాయుల ఆందోళన
- సర్కారు అభాసుపాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో అండర్‌టేకింగ్ ఇచ్చిన వందలాది మంది ఉపాధ్యాయుల పేర్లు పరస్పర బదిలీల ఉత్తర్వుల జాబితాలో గల్లంతు కావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. మార్చి నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. అయినా పాఠశాల విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. సక్రమంగా పరస్పర బదిలీల ఉత్తర్వులను జారీ చేయడంలో విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తప్పులతడకగా ఆ ఉత్తర్వులుండడం గమనార్హం. రాష్ట్రంలో పరస్పర బదిలీల కోసం 2,958 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. వారిలో 1,260 మంది మాత్రమే అండర్‌టేకింగ్ ఇచ్చారు. వారి పేర్లనూ పాఠశాల విద్యాశాఖ అధికారులు పరిశీలించి ఉత్తర్వులు జారీ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. అధికారుల తీరుతో రాష్ట్ర ప్రభుత్వం అభాసుపాలవుతున్నది. పరస్పర బదిలీల కోసం జనగామ జిల్లాలో 225 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 106 మంది అండర్‌టేకింగ్ ఇచ్చారు. కానీ పరస్పర బదిలీల జాబితాలో మాత్రం 45 మంది ఉపాధ్యాయుల పేర్లే వచ్చాయి. 61 మంది పేర్లు గల్లంతయ్యాయి. ఆ జిల్లా డీఈవో మాత్రం అండర్‌టేకింగ్ ఇచ్చిన 106 మంది పేర్ల జాబితాను పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయానికి పంపించామంటూ సమాధానమిచ్చారు. సిద్ధిపేట జిల్లా నుంచి 103 మంది టీచర్లు అండర్‌టేకింగ్ ఇచ్చినవారిలో ఉన్నారు. కానీ 65 మంది పేర్లు పరస్పర బదిలీల జాబితాలో ఉన్నాయి. మిగిలిన 38 మంది పేర్లు గల్లంతయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో 70 మంది ఉపాధ్యాయులు అండర్‌టేకింగ్ ఇచ్చారు. కానీ 65 పేర్లు మాత్రమే ఆ జాబితాలో ఉన్నాయి. అంటే ఐదు మంది పేర్లు రాలేదు. హన్మకొండ జిల్లాలో 134 మంది ఉపాధ్యాయులు అండర్‌టేకింగ్ ఇచ్చిన వారిలో ఉన్నారు. కానీ పరస్పర బదిలీల జాబితాలో 109 మంది పేర్లే ఉన్నాయి. అంటే 25 మంది పేర్లు గల్లంతయ్యాయి. వికారాబాద్ జిల్లాలోనూ 54 మంది పేర్లు ఆ జాబితాలో లేవు. ఇలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ అండర్‌టేకింగ్ ఇచ్చినా ఆ ఉపాధ్యాయుల పేర్లు పరస్పర బదిలీల జాబితాలో కనిపించకపోవడం విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. అంటే పంతుళ్ల జీవితాలతో అధికారులు ఎలా చెలగాటమాడుతున్నారో అర్థమవుతున్నది. పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయంలో అండర్‌టేకింగ్ ఇచ్చినా పరస్పర బదిలీల జాబితాలో పేర్లు రాని ఉపాధ్యాయులు సుమారు 92 మంది మళ్లీ దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. డీఈవోల నుంచి పూర్తి సమాచారం తెప్పించుకునే పనిలో విద్యాశాఖ అధికారులు నిమగమయ్యారు. బుధవారం నాటికి అండర్‌టేకింగ్ ఇచ్చి పేర్లు రాని జాబితాను సిద్ధం చేసే అవకాశమున్నది. వాటిని పరిశీలించి మళ్లీ ఉత్తర్వులు జారీ చేయొచ్చని తెలుస్తున్నది.
పరస్పర బదిలీల కోసం మూణ్నెళ్లుగా కసరత్తు...
రాష్ట్రంలో ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ మార్చి నుంచి కసరత్తు చేస్తున్నది. మూణ్నెళ్లుగా కసరత్తు చేస్తున్నా కేవలం రెండున్నర వేల మంది ఉపాధ్యాయులకు సక్రమంగా ఉత్తర్వులు జారీ చేయలేదన్న విమర్శ ఉన్నది. ఉపాధ్యాయులకు సీనియార్టీతో కూడిన పరస్పర బదిలీలు కల్పిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 402ను జారీ చేసింది. దానిపై కొందరు ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో 402ను పక్కనపెట్టింది. సీనియార్టీ లేకుండా పరస్పర బదిలీలుంటాయని జీవోనెంబర్ 21ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. సీనియార్టీ లేకుండా పరస్పర బదిలీలకు దరఖాస్తుకు అంగీకరించే ఉపాధ్యాయుల నుంచి అంగీకార పత్రం (అండర్‌టేకింగ్) తీసుకోవాలని నిర్ణయించింది. అవన్నీ తీసుకున్నారు. డీఈవోలు పరిశీలించి పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయానికి పంపించారు. విద్యాశాఖ కార్యదర్శి, ఆర్థిక శాఖ అధికారులు సైతం వాటిని పరిశీలించారు. అయినా పరస్పర బదిలీల జాబితాలో తప్పులు రావడం, అండర్‌టేకింగ్ ఇచ్చినా పేర్లు రాని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
రెండో జాబితా ప్రకటించాలి : టీఎస్‌యూటీఎఫ్
పరస్పర బదిలీల్లో పేర్లు గల్లంతైన ఉపాధ్యాయులతో రెండో జాబితా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్ చేశారు. అండర్‌టేకింగ్ ఇచ్చి డీఈవోల ద్వారా పాఠశాల విద్యాశాఖకు పంపిన జాబితాలో పేర్లు గల్లంతు కావడం విచారకరమని తెలిపారు. మూణ్నెళ్లుగా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న వారికి నిరాశే ఎదురైందని పేర్కొన్నారు. రెండున్నర వేల మంది ఉపాధ్యాయులకు పరస్పర బదిలీల్లోఏ ఇలాంటి అవకతవకలు జరగడం విద్యాశాఖ ప్రతిష్ట ను దిగజారుస్తుందని విమర్శించారు. తక్షణమే అన్ని జిల్లాల నుంచి సమగ్రమైన సమాచారం తెప్పించు కుని అర్హులైన ఉపాధ్యాయులందరికీ పరస్పర బదిలీ ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి : టీఎస్పీటీఏ
పరస్పర బదిలీల జాబితాలో తప్పిదాలకు బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఎస్పీటీఏ అధ్యక్షులు సయ్యద్ షౌకత్‌అలీ, ప్రధాన కార్యదర్శి అలీపిట్ల రాజయ్య డిమాండ్ చేశారు. బదిలీ అవకాశం కోల్పోయిన ఉపాధ్యాయులకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.