Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభమైన ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తరగతులు
- నెల రోజుల్లోపు సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ
నవతెలంగాణ-బాసర
బాసర ట్రిపుల్ ఐటీ వారం రోజులుగా విద్యార్థుల నిరసనలతో హోరెత్తింది. సోమవారం రాత్రి విద్యాశాక మంత్రి సబితాఇంద్రారెడ్డి విద్యార్థులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో మంగళవారం ఆర్జీయూకేటీ తరగతి గదుల్లో విద్యార్థుల సందడి ప్రారంభమైంది. తమ డిమాండ్ల సాధనకు ఆరువేల మంది విద్యార్థులు విడతలవారీగా శాంతియుతంగా ఆందోళన చేపట్టారు. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, డైరెక్టర్ సతీష్‌కుమార్, ఎస్పీ ప్రవీణ్‌కుమార్ యూనివర్శిటీ అధికారులతో పలు దఫాలుగా చర్చలు జరిపినా విఫలమయ్యాయి. దాంతో సోమవారం అర్ధరాత్రి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఇన్చార్జి వైస్‌ఛాన్స్‌లర్ రాహుల్ బొజ్జా, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ వెంకటరమణ, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి, యూనివర్సిటీ అధికారులు విద్యార్థులో సమావేశమయ్యారు. విద్యార్థులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తాము ప్రతిపాదించిన సమస్యలను నెలరోజుల కాలపరిమితిలోగా పరిష్కరించాలని విద్యార్థులు కోరారు. ఈ డిమాండ్లను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం యూనివర్సిటీ డైరెక్టర్ సతీష్‌కుమార్, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, విద్యార్థులు విడివిడిగా విలేకరుల సమావేశంలో చర్చల వివరాలను వెల్లడించారు. విద్యార్థులు ఆందోళన విరమిస్తున్నట్టు ప్రకటించారు. నెల రోజుల్లోపు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని మంత్రి చెప్పినట్టు తెలిపారు.
విద్యార్థుల డిమాండ్లు ఇవే..
- సెర్చ్ కమిటీ ద్వారా యూనివర్శిటీకి వైస్ ఛాన్స్‌లర్‌ను నియమించాలి.
- ప్రభుత్వ గ్రాంట్స్ విడుదల చేయాలి
- బడ్జెట్లో నిధులు కేటాయించాలి.
- లాప్టాప్, యూనిఫామ్స్, బెడ్స్ ఇవ్వాలి.
- 8వేల మంది విద్యార్థులకు సరిపడా అధ్యాపకులను భర్తీ చేయాలి,
- మహిళా పీఈటీలను నియమించాలి.
- 24 గంటల పాటు లైబ్రరీని అందుబాటులో ఉంచాలి.
- ఎలక్ట్రిసిటీ ఫ్లంబింగ్ సమస్యలు పరిష్కరించాలి
- హాస్టల్, తరగతి గదులకు మరమ్మతులు చేపట్టాలి.