Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను కేంద్రం అమ్మడం సరికాదు
- పునరుద్ధరించాలి లేదా కొత్త పరిశ్రమలను నెలకొల్పాలి: సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో గతంలో కేంద్రం ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను తెగనమ్మడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిం చడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్రకమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవా లని డిమాండ్ చేసింది. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడానికి అనువుగా ఉన్న నేపథ్యంలో వాటిని పునరుద్ధరించడమో లేదంటే కొత్తగా ప్రారంభించడమో చేయాలని కోరింది. లేదంటే ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలని సూచించింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో మూసేసిన ఐడీపీఎల్, హెచ్ఏఎల్, హెచ్ఎంటీ, హెచ్సీఎల్, డీఆర్డీఎల్, సీసీఐ వంటి సంస్థల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 7,200 ఎకరాల భూమిని కేటాయించిందని తెలిపారు. ప్రస్తుతం ఈ సంస్థలను ఉద్దేశ్యపూర్వకంగానే మూసేసి వాటి ఆస్తులు, భూములను కారుచౌకగా అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం చూస్తున్నదని విమర్శించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నదని పేర్కొన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో రూ.వేలకోట్ల ప్రజల ఆస్తులను కేంద్రం తెగనమ్మడానికి రంగం సిద్ధం చేసిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు భూములను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నేపథ్యంలో వాటిని అమ్మడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ఆ భూములను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికే స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులు రాష్ట్ర ప్రజల సంపద అని తెలిపారు. కార్పొరేట్లకు కొమ్ముకాసే మోడీ ప్రభుత్వం రూ.కోట్లాది విలువైన భూములను అదానీకో, అంబానీ వంటి కార్పొరేట్లకు కట్టబెట్టాలని చేస్తున్న ప్రయత్నాలను ప్రజలంతా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.