Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుబంధు జాడ లేక.. రైతుల అవస్థలు
- రాష్ట్రవ్యాప్తంగా అందనిది రూ.3 వేల కోట్లపై మాటే
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రావాల్సింది రూ.517.16 కోట్లు
- రాజన్నసిరిసిల్ల జిల్లాలోనే 35శాతంమేర జమకాని ధాన్యం డబ్బులు
- రెండ్రోజులుగా వర్షాలు.. ముమ్మరమైన వానాకాలం సాగుపనులు
- వెంటనే పెండింగ్ డబ్బులు ఇవ్వాలి : తెలంగాణ రైతుసంఘం డిమాండ్
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి/విలేకరులు
రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు ఊపందుకున్నాయి. కొన్ని జిల్లాల్లో బాగున్నా.. మరికొన్ని చోట్ల చినుకులు పడుతున్నాయి. వర్షాలు పూర్తిస్థాయిలో పడతాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, వానాకాలం సాగు పనులకు రైతాంగమంతా సన్నద్ధమవుతోంది. వరి దుక్కులు సిద్ధం చేసుకుంటోంది. ఈ సమయంలో పెట్టుబడి కోసం కొందరు రైతులు అవస్థలు పడుతున్నారు. అందులోనూ మొన్నటి యాసంగి ధాన్యం అమ్మి ఇంకా ఖాతాల్లో డబ్బులు పడని అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. నెలా, 20రోజులవుతున్నా.. కొందరికి వడ్లపైసలు ఖాతాలో జమకాలేదు. ఈ విషయాన్ని రైతులు అధికారుల వద్ద మొరపెట్టుకుంటున్నారు. మొన్నటివరకు వరికోత, ఇతర రవాణా ఖర్చులు అప్పులు చేసి చెల్లించగా.. ఇప్పుడు పొలం దున్నేందుకు, ఇతర కూలీల ఖర్చులకుడబ్బులు లేక అవస్థలు పడుతున్నారు. రైతుబంధు డబ్బులు కూడా రాకపోవడంతో సాగుప్రారంభ ఖర్చుల కోసం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడువేల కోట్ల రూపాయలపైనే రైతులకు డబ్బులు రావాల్సి ఉంది. అత్యధికంగా కరీంనగర్, కామారెడ్డి, జనగామ, నిజామాబాద్, సూర్యాపేట, వంటి జిల్లాల్లో డబ్బులు పెండింగ్లో ఉన్నాయి. ఉదాహరణకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇంకా రూ.517.16కోట్ల డబ్బుల కోసం పక్షం రోజులపైనే రైతాంగం ఎదురుచూస్తోంది. పెండింగ్ డబ్బులను రైతులకు వెంటనే అందజేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 1286 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,91,852 మంది రైతుల నుంచి సుమారు 11.2లక్షల మెట్రిక్టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఈ మొత్తం ధాన్యం విలువ రూ.2197.16కోట్లుకాగా.. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో జమ చేసింది కేవలం రూ.1680కోట్లు మాత్రమే. మిగిలిన రూ.517.16కోట్లు 20రోజులుగా ప్రభుత్వ విడుదల చేయకపోవడంతో సాగుకోసం సన్నద్ధమైన రైతులు పెట్టుబడి డబ్బుల్లేక అవస్థలు పడుతున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 76.46శాతం డబ్బులు మాత్రమే ఆయా రైతుల ఖాతాల్లో జమ చేయగా.. మిగిలిన 23.54శాతం డబ్బులు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అందులోనూ రాష్ట్ర ఐటీశాఖమంత్రి కేటీఆర్ ఇలాకా అయిన రాజన్నసిరిసిల్ల జిల్లాలో సుమారు 35శాతం ధాన్యం డబ్బులను ఆయా రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉండటం గమనార్హం. ఇక జిల్లాలవారీగా చూస్తే ధాన్యం చెల్లింపుల్లో పెద్దపల్లి 87శాతం, కరీంనగర్ జిల్లా 81శాతం, జగిత్యాల జిల్లా 79శాతం మాత్రమే యాసంగి ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. మిగిలిన డబ్బులు జమ చేయకపోవడానికి ప్రధానంగా కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం చేరడం ఆలస్యం కావడం, ఆ ధాన్యం విలువ ఇంకా ఆన్లైన్లో చేయడంలో జాప్యం చోటుచేసుకోవడం వంటి సమస్యలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. మరోవైపు గత యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో అటు కేంద్రం, రాష్ట్రం దోబూచులాడటంతో ఉమ్మడి జిల్లాలోసుమారు 2.3లక్షల ఎకరాల్లో వరి వేయకుండా రైతులు బీడుగా వదిలేశారు. ఇప్పుడు ఆ భూములూ సాగుకు రెడీ అవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం కూడా రైతుబంధుకు సంబంధించిన డబ్బులు వానాకాలం సీజన్ ప్రారంభమైనా ఇంకా విడుదల చేయకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.. రైతుల వివరాలను సేకరించిన రాష్ట్ర వ్యవసాయశాఖ నిధుల్లేక విడుదల చేయడంలేదని సంబంధిత శాఖ అధికారి 'నవతెలంగాణ'తో తెలిపారు. దీంతో అటు రైతుబంధు డబ్బులు రాక, ఇటు యాసంగి ధాన్యం డబ్బులందక సుమారు 30శాతం మంది రైతులు పెట్టుబడి కోసం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్న పరిస్థితి నెలకొంది. రబీ సీజన్లో వరి ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ కొందరి రైతులకు దాన్యం డబ్బులు అందలేదు పూర్తి వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లాలో మొత్తం 344 సెంటర్లో ఏర్పాటు చేసి వాటి ద్వారా, 2, లక్షల, 71 వేల మెట్రిక్ టన్నులు , 55869 మంది రైతుల నుండి కొనుగోలు చేసింది, కొనుగోలు చేసిన ధాన్యం రైతులకు చెల్లించవలసిన రూపాయలు 530 కోట్లు కాగా, అందులో 396 కోట్లు మాత్రమే రైతుల అకౌంట్లో జమ చేశారు, 143 కోట్ల రూపాయలు 15 వేల రైతుల మందికి ఎప్పుడూ చెల్లిస్తారు స్పష్టత లేదు.
పంట అమ్మిన పైసలు తొందరగియ్యాలే..
రెండున్నర ఎకరాల్లో వరి వేసిన. వచ్చిన ధాన్యం అమ్మి 20రోజులపైనే అవుతోంది. ఇంతవరకు ఆ డబ్బులు ఖాతాలో పడలేదు.మళ్లీ విత్తనపు వడ్లు తెద్దామంటే చేతిల పైసల్లేవు. ఇంకా రైతుబంధు పైసలు రాలే. బయటనేమో మిత్తి బాగా అడుగుతున్నరు. పంట అమ్మిన పైసలు తొందరగియ్యాలే!
- తిరుపతి, వీర్నపల్లి రైతు, రాజన్నసిరిసిల్ల
పంట పైసలురాలే.. రైతుబంధు పడలే...
కౌకిలోళ్లకు ఇంకా డబ్బులు ఇవ్వలే. వరి కోసిన ట్రాక్టరోళ్లు పైసలకు ఆగుతలేరు. ఆడాఇడా అప్పులు తెచ్చిన కొందరికి ఇచ్చిన. పాత అప్పులు కడితేనే కొత్తగా అప్పు ఇస్తామంటున్నరు. నేను వడ్లమ్మి 20రోజులవుతోంది. బ్యాంకుకు రోజుపోయి చూస్తే అకౌంట్ల పైసలు పడలేదంటున్నరు. వడ్లమ్మిన పైసలు వస్తేనే అప్పులు తీర్చేది. కనీసం రైతుబంధూరాక పొలం ఇంకా దున్నలేదు.
- బండారి ఐలవ్వ, మద్దిమల్ల గ్రామం, రాజన్నసిరిసిల్ల జిల్లా