Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూలి పెంచాలని డిమాండ్
- నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలి : సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేష్
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా మార్బుల్ గ్రానైట్ పాలిష్ కార్మికుల కూలి రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ వరంగల్ నగరంలో కార్మికులు సమ్మె చేపట్టారు. సమ్మె మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ తీశారు. కాశిబుగ్గ పోచమ్మ మైదాన్ సర్కిల్ ములుగు రోడ్డు నుంచి ఖాజీపేట ఫాతిమా చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. అంతకుముందు యూనియన్ అధ్యక్షులు యాకూబ్ పాషా అధ్యక్షతన ఓసిటీలో జరిగిన సభలో మార్బుల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేష్ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. మార్బుల్ మిషన్స్ టైల్స్ కటింగ్ మిషన్స్ బ్లేడ్స్ ఇతర ధరలను కేంద్ర ప్రభుత్వం విపరీతంగా పెంచిం దన్నారు. కానీ, మార్బుల్ గ్రానైట్ టైల్స్ కార్మికుల బతుకులు దుర్భరంగా మారాయన్నారు. 30 శాతం కూలి రేట్లను పెంచుతున్నారని, గృహ యజమానులు, బిల్డర్స్ మెటీరియల్ కాంట్రాక్టర్లు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు కార్మికుల పట్ల చిత్తశుద్ధి చూపడం లేదన్నారు. మార్బుల్ గ్రానైట్ టైల్స్ పాలిష్ కార్మికులకి పని భద్రత కల్పించాలని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండి బజార్ మార్బుల్ యూనియన్ అధ్యక్షులు యాకూబ్ పాషా, మీర్జా ఫయాజ్, ఎస్కే ఖాజా, వరంగల్ టైల్స్ యూనియన్ అధ్యక్షులు సునీల్, డి.ప్రసాద్, హనుమకొండ అధ్యక్షులు కె.అశోక్, డి.యుగేందర్, అధ్యక్షులు రవి, రాజస్థాన్ మార్బుల్ యూనియన్ అధ్యక్షులు సుభాష్ షైనీ భీమ్ రాజ్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.