Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాయకత్వంపైనా అసంతృప్తి
- మంత్రి కేటీఆర్ నాకంటే జూనియర్ :
- మాజీ ఎమ్మెల్యే తాటి సంచలన వ్యాఖ్యలు
నవతెలంగాణ - అశ్వారావుపేట
తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్న అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అదే పార్టీ పైనా, నాయకత్వంపైనా తీవ్ర విమర్శలు చేస్తూ వ్యతిరేక గళం ఎత్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కేంద్రంలో మంగళవారం తాటి వెంకటేశ్వర్లు విలేకర్ల సమావేశంలో సొంత పార్టీపై అసంతృప్తిని వెళ్లగక్కారు. పార్టీ కోసం ఎంతో పాటుపడిన తనను కనీసం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాదించిన తనని నాడు టీఆర్ఎస్ పార్టీలోకి గౌరవంగా ఆహ్వానించిన వ్యక్తులు.. నేడు పార్టీ కార్యక్రమాలకు ఎందుకు ఆహ్వానించడం లేదని ప్రశ్నించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొందరు సీనియర్ నాయకులు తనను రాజకీయపరంగా అణగదొక్కేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే తనను పార్టీ కార్యకలాపాల్లో పక్కన పెడుతున్నారన్నారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామనే హామీతోనే వైసీపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి చేరానన్నారు. కానీ ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదని, పోడు భూములకు పట్టాల విషయంలో సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకుంటారన్న నమ్మకం లేదని అన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తనకంటే జూనియర్ అన్నారు. 1981లోనే తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీలో నిలిచి సర్పంచ్‌గా గెలిచి ఆ తర్వాత రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేశానని, ఆ విధంగా చూసుకుంటే నేనే సీనియర్ అవుతానని చెప్పారు.
ఇటీవల ఖమ్మం నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన ఇద్దరు స్థానికంగానే ఉంటున్నారా అని ప్రశ్నించారు. కొత్త రాజ్యసభ సభ్యులు జిల్లాకు వచ్చే సందర్భంలో ఇచ్చిన మీడియా యాడ్స్, ఫ్లెక్సీలలో తన ఫొటోని వేయకుండా అవమానించారని ఆవేదన వెలిబుచ్చారు. తన కూతురు చనిపోయిన 10 రోజులకు జిల్లా మంత్రి వచ్చి పరామర్శించారని, మంత్రి పువ్వాడ అజరుకు తానంటే ఎంత ప్రేమో పరామర్శించిన తీరుని చూస్తే అర్థం అవుతుంద న్నారు. ఇక పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి తనను పరామర్శించిన వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలను కలుపుకొని పోతేనే పార్టీకి మనుగడ అని చెప్పినప్పటికీ జిల్లా సీనియర్ నాయకులు కేటీఆర్ మాటలను పట్టించుకునే పరిస్థితిలో లేరన్నారు. 2018 ఎన్నికల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వగ్రామంలోనే టీఆర్ఎస్కు ఓట్లు వేయించుకోలేకపోయారని, ఇక ఇతర నియోజకవర్గాల్లో ఓట్లు వేయించే స్థాయి ఆయనకు లేదంటూ ఎద్దేవా చేశారు. తనకు జరుగుతున్న అవమానాల విషయంలో పార్టీ అధిష్టానం స్పందించకుంటే పార్టీ వీడటం ఖాయమని స్పష్టం చేశారు. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అశ్వారావుపేట నుంచి పోటీలో ఉంటానని చెప్పారు. సమావేశంలో ఆయన వెంట జెడ్పీటీసి మాజీ సభ్యులు అంకత మల్లిఖార్జునరావు, అశ్వారావుపేట ఎంపీపీ, పీఏసీఎస్ ఉపాధ్యక్షులు సుంకవల్లి వీరభద్రరావు ఉన్నారు.