Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జులై చివర్లో రాష్ట్ర మహాసభలు : టీవీఆర్ఓడబ్ల్యూఏ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వీఆర్వోల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికె ఉపేందర్‌రావు డిమాండ్ చేశారు. జులై చివర్లో తమ యూనియన్ మహాసభ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లోని నాంపల్లిలోని రాజమాత హోటల్లో ఆ సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వ తీరుతో సమాజంలో అవమాన భారంతో బతకాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి సాంకేతికపరమైన 'ధరణి' ద్వారా ప్రజలకు త్వరతగతిన, అవినీతి రహిత సేవలందిస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికీ లక్షలాది మంది రైతులకు పట్టాదార్ పాసుపుస్తకాలను అందించలేదని చెప్పారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం ఎక్కువైందని తెలిపారు. వీఆర్ఓలకు పనిలేదని చెప్పిన రాష్ట్ర సర్కారు అధికార దుర్వినియోగనికి పాల్పడుతూ, దొడ్డిదారిన బలవంతంగా పనిచేయిస్తున్నదని విమర్శించారు. 1984 నుంచి నేటి వరకూ రెవెన్యూవ్యవస్థలోని కిందిస్థాయి ఉద్యోగులతో ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శాస్త్రీయ పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవాల్సిన పాలకులు ఓట్ల రాజకీయాలు చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. వీఆర్వోలను రెవెన్యూ వ్యవస్థలోనే రీలొకేట్ చేయాలనీ, వెంటనే జాబ్‌చార్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు. పదోన్నతులు కల్పించాలని కోరారు. అకాల మరణం చెందిన వీఆర్వోల కుటుంబాల్లో అర్హులైన వారిని కారుణ్య పద్ధతుల్లో నియామకాలు చేపట్టాలని కోరారు. వీఆర్వోలను రెగ్యులరైజ్ చేయాలనీ, ఇంక్రిమెంట్లు ఇవ్వాలని విన్నవించారు. వీఆర్వోలందర్నీ ఐక్యపరిచి తహశీల్దార్లు, ఆర్డీఓ, కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామనీ, జులై నెల చివర్లో రాష్ట్ర మహాసభ హైదరాబాద్‌లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు మోహన్, పరమేశ్వరావు, కోనబోయిన ప్రసాద్, 27 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.