Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాటి పరిష్కారం కోసం
- 29న ఇందిరాపార్క్ వద్ద ధర్నా : ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ -నల్లగొండ
రాష్ట్రంలో ఐద్వా చేపట్టిన సర్వేలో అనేక సమస్యలు వెలుగులోకొచ్చాయని, వీటన్నింటి పరిష్కారం కోసం ఈనెల 29వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తెలిపారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డికొమరయ్య భవనంలో ఆమె విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాపితంగా రేషన్ కార్డులు, ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు, అభయహస్తం నిధుల సమస్య, స్థానికంగా రోడ్లు, డ్రయినేజీ, మంచినీటి, ఉపాధి సమస్య తీవ్రంగా ఉన్నట్టు రెండు నెలలపాటు ఐద్వా నిర్వహించిన సర్వేలో తమ దృష్టికి వచ్చాయన్నారు. వాటిపై మండల, జిల్లా స్థాయిలో ధర్నాలు చేసి సంబంధిత అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినట్టు తెలిపారు. దీంట్లో కొన్ని సమస్యలు పరిష్కరించినప్పటికీ ప్రధాన సమస్యలైన ఉపాధి, రేషన్ కార్డులు, అభయహస్తం నిధులు, పింఛన్లు, ఇండ్ల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని చెప్పారు. రాష్ట్రంలో లక్ష 90 వేల ఇండ్లు పూర్తి చేసినట్టు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రకటించారన్నారు. కానీ నేటికి 19 వేల ఇండ్లు మాత్రమే లబ్దిదారులకు అందాయని తెలిపారు. రాష్ట్రంలో ఇండ్లు నిరుపేదలు లక్షల మంది ఉన్నారని, వారికి ఇంకెప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. సొంత జాగా కలిగి ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం 3 లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తామని చెప్పి 6 నెలలు పూర్తయినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసరా పింఛన్ కోసం లబ్దిదారులు 11 లక్షల మంది దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నారని చెప్పారు. కొన్ని గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో కలిపిన కారణంగా అక్కడ ఉపాధి లేక అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు. పట్టణ ప్రాంతాలకు ఉపాధి హామీ చట్టాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో 29న నిర్వహించనున్న ధర్నాలో మహిళలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఐద్వా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పోల బొయిన వరలక్ష్మి , పాలడుగు ప్రభావతి, సహాయ కార్యదర్శి కొండ అనురాధ తదితరులు పాల్గొన్నారు.