Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోరాట యోధులు రొడ్డ అంజయ్య, వేముల మహేందర్లకు నివాళి :
- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు
నవతెలంగాణ - భువనగిరి
జీవితాంతం విప్లవ మార్గాన్ని ఎంచుకుని కార్మికుల, కష్టజీవుల, వ్యవసాయ కూలీల హక్కులకోసం అనేక పోరాటాలకు నాయకత్వం వహించిన పోరాట యోధులు రొడ్డ అంజయ్య, వేముల మహేందర్లని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు చెప్పారు. వారి స్ఫూర్తితో కూలీ, భూమి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు రొడ్డ అంజయ్య సంతాప సభ, వేముల మహేందర్ ప్రథమ వర్థంతి సభ నిర్వహించారు. వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వెంకట్రాములు మాట్లాడుతూ.. విద్యార్థులు, యువజనులు, రైతులు, పేదలు, అసంఘటితరంగ కార్మికులు, వ్యవసాయ కూలీలు, ఉపాధిహామీ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రొడ్డ అంజయ్య, వేముల మహేందర్ వివిధ సంఘాల నిర్మాణం చేపట్టారన్నారు. అనేక పోరాటాలకు నాయకత్వం వహించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల హక్కులను, చట్టాలను కాలరాస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేట్పరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ దేశాన్ని తాకట్టు పెడుతోందని విమర్శించారు. అనేక పోరాటాల ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచి నిర్వీర్యం చేయాలనే కుట్రలు చేస్తోందన్నారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన అవసరముందన్నారు. అనేక పోరాటాలకు నాయకత్వం వహించి.. అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన రొడ్డ అంజయ్య, వేముల మహేందర్ ఆశయ సాధనలో కార్యకర్తలంతా ముందుండి పనిచేయాలని పిలుపునిచ్చారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ మాట్లాడుతూ.. ప్రజా ఉద్యమాల నిర్మాతలు, సమాజ మార్పు కోసం జీవితాంతం అనేక పోరాటాలు నిర్వహించిన అంజన్న, మహేందర్ ఆశయాలను ముందుకు తీసుకుపోతామని చెప్పారు. బీఎస్పీ రాష్ట్ర నాయకులు బట్టు రామచంద్రయ్య, జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహ, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ముత్యాలు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు కాశిపాక మహేష్ మాట్లాడారు. రాష్ట్ర కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి అధ్యక్షత వహించగా, రాష్ట్ర కమిటీ సభ్యులు జల్లెల పెంటయ్య, రాచకొండ రాములమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌల్, జిల్లా సహాయ కార్యదర్శి గంగాదేవి సైదులు పాల్గొన్నారు.