Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కడుపు మండే ఆర్మీ అభ్యర్థులు నిరసన
- రాకేశ్ కుటుంబాన్ని పరామర్శించిన సీపీఐ(ఎం) బృందం
- ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం త్వరగా ఇవ్వాలని డిమాండ్
నవతెలంగాణ-ఖానాపురం
దేశ భద్రత విషయంలో సైనిక నియామకాల్లో కాంట్రాక్టు విధానం సరికాదని, ఆర్మీ ఫైనల్ పరీక్ష కోసం రెండేండ్లుగా ఎదురు చూసిన అభ్యర్థుల భవిష్యత్‌ను ఆగం చేయొద్దని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్, నాగయ్య అన్నారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని సికింద్రాబాద్‌లో నిరసన తెలిపిన క్రమంలో పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన దామెర రాకేశ్ కుటుంబాన్ని మంగళవారం వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబీర్పేటలో పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చి ఆర్మీ అభ్యర్థులను ఆందోళనకు గురి చేసిందన్నారు. దేశ భద్రత విషయంలో సైనికులను కూడా కాంట్రాక్టు విధానంలో నియమించడం దారుణమన్నారు. 15 సంవత్సరాలు ఉండే ఆర్మీ ఉద్యోగాన్ని నాలుగు సంవత్సరాలకు తగ్గించడం, కాంట్రాక్టు విధానం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రాకేష్ కొన్ని సంవత్సరాలుగా బాపట్లలో ట్రైనింగ్ తీసుకుని ఆర్మీ ర్యాలీలో క్వాలిఫై అయ్యి.. ఫిజికల్ టెస్ట్ మొత్తం పాసయ్యాడని చెప్పారు. రెండేండ్లుగా ఆర్మీ ఫైనల్ ఎగ్జామ్ కోసం ఎదురుచూస్తున్నాడన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు ఎనిమిది సార్లు ఆర్మీ పరీక్షలు వాయిదా వేశారు. ఇప్పుడు అకస్మాత్తుగా అగ్నిపథ్ పథకం తీసుకొచ్చి 17 సంవత్సరాలు ఉన్న ఉద్యోగాన్ని నాలుగు సంవత్సరాలు తగ్గిస్తే ఆర్మీ అభ్యర్థుల భవిష్యత్ ఏం కావాలని ప్రశ్నించారు. అందుకే వారు కడుపుకాలి నిరసన తెలిపితే.. పోలీసులు కాల్పులు జరపడం దారుణమన్నారు. ఈ కాల్పుల్లో రాకేశ్ ప్రాణం కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రాకేశ్ కుటుంబానికి ప్రకటించిన రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఒకరికి ఉద్యోగం త్వరగా అమలయ్యేలా చూడాలని కోరారు. ఆందోళనలో పాల్గొన్న అభ్యర్థులను అరెస్టు చేసి జైల్లో పెట్టి వారికి ఎలాంటి ఉద్యోగం రాకుండా చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అసెంబ్లీని ఏర్పాటు చేసి అగ్నిపథ్ పథకాన్ని రద్దుకు తీర్మానం చేయాలని కోరారు. రాకేశ్ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోరబోయిన కుమారస్వామి, భూక్య సమ్మయ్య. నాయకులు హన్మకొండ శ్రీధర్, చింతకింది తిరుపతి, పిండి రాములు, గడ్డమీది బాలకృష్ణ, యస్.కె.అన్వర్, ముంజల రవి, యార ప్రశాంత్ తదితరులు ఉన్నారు.