Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్
- దాడులు, కేసులకు భయపడేది లేదు:
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య
నవతెలంగాణ-మట్టెవాడ
వరంగల్లో 42 రోజులుగా జరుగుతున్న పోరాటం కేవలం ఇక్కడిదే కాదని.. రాష్ట్రంలోని పేదలందరి ఇండ్ల స్థలాల సాధన పోరాటమని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. రంగశాయిపేట ప్రాంతంలోని జక్కలొద్ది గుడిసెవాసులను మంగళవారం వారు కలిశారు. గుడిసెల కూల్చివేత.. అరెస్టులపై మహిళలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పోలీసుల దాడిలో గాయపడిన వారిని పరామర్శించి.. సీపీఐ(ఎం) అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం సీపీఐ(ఎం) రంగశాయిపేట ఏరియా కార్యదర్శి మాలోత్ సాగర్ అధ్యక్షతన జరిగిన భూపోరాట సభలో వెంకట్ మాట్లాడారు. జక్కలొద్దిలో 42 రోజులుగా చేస్తున్న పోరాటం.. రాష్ట్రవ్యాప్తంగా ఇండ్లులేని పేదలు కలిసి నడుపుతున్న ఐక్య భూపోరాటం అని చెప్పారు.
నాడు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, బాంచన్ అన్న బక్కోళ్ల చేత బంధూకు చేతబట్టించి భూస్వాములను, నైజాం నవాబును తరిమికొట్టిందని చెప్పారు. ఈ పోరాటం ఓరుగల్లు జిల్లా కేంద్రంగా సాగిందని, అదే వారసత్వంతో నేడు వరంగల్లో ఇండ్లస్థలాల కోసం అనేక దఫాలుగా పోరాటం సాగుతోందని అన్నారు. వేలాది మంది నిరుపేదలు ఇండ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ పోరాటంలో వెనకడుగు వేయకుండా ప్రభుత్వం మెడలు వంచి ఇండ్ల స్థలాలు, ఇండ్లు సాధించాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య మాట్లాడుతూ.. నెలల తరబడి భూమిని అంటిపెట్టుకుని ఉన్న పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక్కడి భూమిలో కోర్టుకి ఇచ్చిన 10 ఎకరాలు పోను మిగతా 40 ఎకరాలను పేద ప్రజలకు ఇవ్వాలని, లేకుంటే ఆ 10 ఎకరాలను కూడా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇండ్ల స్థలాలు లేని పేదలకు పట్టాలు ఇవ్వకుండా కొందరు కుట్ర చేస్తున్నారని, ఆ కుట్రలను ప్రజాపోరాటాల ద్వారా భగం చేస్తామని అన్నారు. ఎంత మందిపై కేసులు పెట్టినా, దాడులు చేసినా భూమిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పేదలకు ఇండ్ల స్థఆలు, పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సభలో సీపీఐ(ఎం) నాయకులు అరూరి కుమార్, ఓదేలు, రమేష్, ప్రశాంత్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.