Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిమ్జ్ ప్రాజెక్టు శంకుస్థాపనకు వచ్చిన మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ
- పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలని రైతుల ఆందోళన
- గంగ్వార్‌లో రైతులపై లాఠీఛార్జి
- గాయపడ్డ మహిళా రైతులు.. ఆస్పత్రికి తరలింపు
నవ తెలంగాణ-జహీరాబాద్
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం చీలపల్లిలో 550 ఎకరాల్లో రూ.వెయ్యి కోట్లతో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ జోన్(నిమ్జ్) ప్రాజెక్టు నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేయడానికి వచ్చిన మంత్రి కేటీఆర్ పర్యటనను భూనిర్వాసితులు అడ్డుకున్నారు. తమకు పూర్తిస్థాయిలో పరిహారం ఇచ్చిన తర్వాతనే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. న్యాల్కల్ మండలం గంగ్వార్ వద్ద పోలీసులు రైతులపై లాఠీఛార్జి చేశారు. ఝరాసంగం మండలంలోని ఎల్గోయి, బర్దిపూర్, చీలపల్లి, న్యాల్కాల్ మండలంలోని ముంగి, ముంగితండా, హద్నూర్, రేజింటల్, మొల్కలపాడు, మిర్జాపూర్, (ఎన్)మల్కాపూర్, గుంజాటి, రుక్మాపూర్ తండా, రామతీర్థం తదితర గ్రామాలను పూర్తిగా పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ రైతులను కట్టడి చేశారు. రైతులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎల్గోయి గ్రామాల రైతులను అరెస్ట్ చేసి ఝరాసంగం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆయా గ్రామాల్లో హౌటళ్లను, కిరాణం షాపులను పోలీసులు బంద్ చేయించారు. జహీరాబాద్ నుంచి మాచ్నూర్, బర్దిపూర్ క్రాస్ రోడ్డు నుంచి నిమ్జ్ ప్రాజెక్టుకు భూమిపూజ చేసే స్థలం వరకు అడుగడుగునా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైతులను పొలాలకు వెళ్లనివ్వడం లేదు. గంగ్వార్ వద్ద పోలీసులు రైతులపై, గ్రామస్తులపై లాఠీఛార్జి చేశారు. బుధవారం ఉదయం నుంచి న్యాల్కల్ మండలం వివిధ గ్రామాల రైతులను అరెస్టు చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య మంత్రి కేటీఆర్‌ను భూమిపూజ చేసే స్థలానికి తీసుకెళ్లారు. మామిడ్గికి చెందిన 25 మందిని రైతులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల లాఠీఛార్జిలో గాయపడిన మామిడ్గికి చెందిన పద్మమ్మ, స్వాతి, అంజిరెడ్డిలకు రాయికోడ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రామ్‌చందర్‌ను, రైతులను పోలీసులు అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు.