Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ హక్కుల చట్టాన్ని తూట్లు పొడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
- ఖనిజ సంపదను దోచుకుంటున్న కార్పొరేట్లు
- అడవి సంపదను నాశనం చేస్తున్నారు
- రాష్ట్ర పోడు రైతుల సదస్సులో మాజీ ఎమ్మెల్యే జూలకంటి, పోతినేని, సాగర్
నవతెలంగాణ-పాల్వంచ
ఎన్నో ఏండ్లుగా కష్టపడి పోడు భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్న గిరిజన బిడ్డల పోడు భూములకు పట్టాలివ్వకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పోతినేని సుదర్శన్రావు, సాగర్, ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో లారీ అసోసియేషన్ హాల్లో బుధవారం పోడు భూములకు పట్టా హక్కు ఇవ్వాలని, పోడుసాగుదారులపై ఫారెస్ట్ నిర్బంధం ఆపాలని డిమాండ్ చేస్తూ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ అధ్యక్షతన రాష్ట్ర పోడు రైతుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పరిష్కరించకుండా వారిని ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములు సాగు చేసుకుంటున్న అర్హులందరికీ పట్టాలిస్తామని చెప్పి 8ఏండ్ల కింద దరఖాస్తులు తీసుకుని హక్కు పత్రాలు ఇవ్వకుండా ప్రభుత్వ హామీకి భిన్నంగా ప్రభుత్వం, ఫారెస్ట్ పోలీసు అధికారులు గిరిజనులపై నిర్బంధం ప్రయోగించడం దారుణమన్నారు. గిరిజనులకు జీవనాధారం లేకుండా తరిమివేయడం ప్రభుత్వానికి తగునా అని ప్రశ్నించారు. అటవీ హక్కుల చట్టాన్ని గౌరవించకుండా తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2005 డిసెంబర్ 13కు ముందు సాగు చేసుకుంటున్న అన్ని రకాల అడవుల్లో పది ఎకరాల వరకు గిరిజనులకు సంప్రదాయంగా ఉంటున్న భూమి, గిరిజనేతరులకు హక్కు పత్రాలు ఇవ్వాల్సి ఉన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నారు. 31 మార్చి 2019 నాటికి తెలంగాణలో 1,86,679 దరఖాస్తులు రాగా 94,360 వరకు పట్టాలు ఇచ్చారు. ఇందులో సమూహాలకు సంబంధించి 3,427 దరఖాస్తులు రాగా 721 గుర్తించబడ్డాయని, ఇంకా ఇప్పటికీ 4,500 పైగా పెండింగ్లో పెట్టారని తెలిపారు. ఇప్పటికీ పట్టాలు ఇవ్వకపోగా.. వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్కరికీ రైతుబంధు, రైతు బీమా వంటి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు వ్యవసాయ శాఖ నుండి విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు అందుబాటులో ఉంచాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాని అయిలయ్య, తుమ్మల వెంకటరెడ్డి, మూడ్ శోభన్, రాష్ట్ర నాయకులు బొంతు రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు అన్నవరపు కనకయ్య, గిరిజన సంఘం నాయకులు దుగ్గి కృష్ణ, ధర్మానాయక్, తెలంగాణ రైతు సంఘం నాయకులు కున్సొత్ ధర్మ, అన్నవరపు సత్యనారాయణ, కొండపైన వెంకటేశ్వర్లు, కే లోకేష్ బాబు పాల్గొన్నారు.