Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడులు ప్రారంభమై 11 రోజులు
- సాధారణ దుస్తులతోనే విద్యార్థుల హాజరు
- ఆలస్యంగా టెస్కోకు ఆర్దర్
- సెప్టెంబర్ నాటికి పిల్లలందరికీ ఇచ్చే అవకాశం
- విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బడులు ప్రారంభమై 11 రోజులవుతున్నది. ఇంత వరకూ ఒక్క విద్యార్థికీ రెండు జతల యూనిఫారాలు ఇవ్వలేదు. ఇప్పటి వరకు విద్యార్థులకు పంపిణీ చేసేందుకు పాఠశాలలకు అవి చేరలేదు. యూనిఫారాల కోసం బట్టను సిద్ధం చేయడం, కుట్టడం వంటి పనులు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. అంటే ఆలస్యంగా తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ (టెస్కో)కు పాఠశాల విద్యాశాఖ ఆలస్యంగా ఆర్డర్ ఇవ్వడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో విద్యార్థుల పట్ల విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉన్నదో దీన్ని బట్టి అర్థమవుతున్నది. కొత్త యూనిఫారాలు రాకపోవడంతో సాధారణ బట్టలు, పాత యూనిఫారాలతోనే విద్యార్థులు బడులకు హాజరయ్యే పరిస్థితి దాపురించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా రెండు జతల యూనిఫారాలు ఉచితంగా అందించాలి. కరోనా నేపథ్యంలో గతేడాది సైతం విద్యార్థులకు వాటిని ఇవ్వలేదు. అంటే ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఒక్కో విద్యార్థికి నాలుగు జతల బట్టలివ్వాలి. కానీ ఆ దిశగా విద్యాశాఖ చర్యలు తీసుకోవడం లేదు. రెండు జతల యూనిఫారాలే ఇవ్వనున్నట్టు ప్రకటించింది. గతేడాది యూనిఫారాలు ఇవ్వకపోయినా ఇచ్చినట్టేనని అధికారులు భావిస్తున్నారా?అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుత విద్యాసంవత్సరంలో యూనిఫారాలు ఎప్పుడు అందుతాయోనని విద్యార్థులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
పంద్రాగస్టు నాటికి ఇస్తామన్న విద్యాశాఖ
రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 26,79,497 మంది విద్యార్థుల రెండు జతల యూనిఫారాలను పంద్రాగస్టు నాటికి ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ మేరకు టెస్కోతో విద్యాశాఖ ఒప్పందం చేసుకుంది. 26,79,497 మంది విద్యార్థుల కోసం 1.40 కోట్ల మీటర్ల బట్ట కావాలని టెస్కో నిర్ణయించింది. మొదటి జత యూనిఫారాలను జులై 15 నాటికి, రెండో జత యూనిఫారాలను ఆగస్టు 15 నాటికి ఇవ్వనున్నట్టు ప్రకటించింది. 5,533 పాఠశాలల్లోని 10,23,519 మంది విద్యార్థులకు మొదటి ప్రాధాన్యతలో యూనిఫారాలు అందించనున్నట్టు వివరించింది. అయితే బట్ట వచ్చిన తర్వాత కుట్టడానికే కనీసం రెండు నెలలకుపైగా సమయం పడుతుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు, విద్యావేత్తలు చెబుతున్నారు. దీంతో పంద్రాగస్టు నాటికి విద్యార్థులందరికీ యూనిఫారాలు అందజేయడం కష్టమేనని అర్థమవుతున్నది. కానీ టెస్కో మాత్రం వాస్తవానికి విరుద్ధంగా జులై 15 నాటికి ఒక జత, ఆగస్టు 15 నాటికి రెండో జత యూనిఫారాలు ఇస్తామని ప్రకటించడం గమనార్హం.
విద్యార్థులకు అందని పుస్తకాలు
ఈనెల 13 నుంచి బడులు పున:ప్రారంభమయ్యాయి. ఇంతవరకూ పాఠ్యపుస్తకాలు స్కూళ్లకు చేరుకోలేదంటే విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం అర్థమవుతున్నది. రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ, స్థానిక సంస్థలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో కలిపి 26 లక్షల వరకు విద్యార్థులు చదువుతున్నారు. వారి కోసం 2.10 కోట్ల పుస్తకాలు అవసరమవుతాయని విద్యాశాఖ అధికారులు అంచనా వేశారు. వాటిలో ఇప్పటి వరకు 40 లక్షల పుస్తకాలను మాత్రమే ముద్రించి జిల్లా కేంద్రాలకు పంపించారు. ఇంకా 1.70 కోట్ల పుస్తకాలను ముద్రించాల్సి ఉన్నది. వాటిని ఎప్పుడు ముద్రిస్తారో, ఎప్పుడు పాఠశాలలకు పంపిస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. వేసవిలో టెస్కోకు ఆర్డర్ ఇచ్చి పాఠశాలలు పున:ప్రారంభమయ్యే నాటికి యూనిఫారాలు పాఠశాలలకు చేరేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఉచిత పాఠ్యపుస్తకాలు సైతం బడులు తెరిచిన వెంటనే విద్యార్థులకు ఇచ్చేందుకు వీలుగా ముద్రించాలని డిమాండ్ చేస్తున్నాయి.