Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్న నేపథ్యంలో అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు సిద్ధమని ఇంటర్నేషనల్ హాస్పిటల్ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. బుధవారం హైదరాబాద్లో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావుతో బ్రిటిష్ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్, ఇంటర్నేషనల్ హస్పిటల్స్ గ్రూప్ సీఈవో చేస్టర్ కింగ్, సీవోవో సైమన్ ఆశ్వర్త్, భారత్ నుంచి ప్రతినిధి పృథ్వి సహాని, ఇతర ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫ్లెమింగ్ మాట్లాడుతూ తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నదని ప్రశంసించారు. హరీశ్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో టిమ్స్, మెడికల్ కాలేజీలు, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం తదితర అంశాలను వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం.రిజ్వీ తదితరులు పాల్గొన్నారు.
ఆగస్ట్ 15లోగా 131 బస్తీ దవాఖానాలు సిద్ధం:
ఈ ఏడాది ఆగస్టు 15లోగా 131 బస్తీదవాఖానాలను ప్రారంభానికి సిద్ధం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్లో ఆయన బస్తీ దవాఖానాలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఇప్పటికే సిద్ధమైన 12 బస్తీ దవాఖానాలు త్వరగా ప్రారంభించాలని సూచించారు. మొత్తం 390 దవాఖానాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావాలని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన 259 బస్తీ దవాఖానాలు ప్రజాదరణ పొందాయని చెప్పారు. అన్ని సేవలనూ ఆన్లైన్ చేయాలనీ, టెలి కన్సల్టేషన్ సేవలు పెంచాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ తదితరులు పాల్గొన్నారు.