Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జులై 2 సడక్ బంద్..3న చలో హైదరాబాద్
- ఎస్సీ వర్గీకరణపై స్పష్టతనివ్వాల్సిందే
- లేకుంటే ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు నిరసన సెగ తప్పదు : మందకృష్ణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్సీవర్గీకరణ, రిజర్వేషన్లపై బీజేపీ జాతీయ నాయకత్వం స్పష్టతనివ్వకపోతే హైదరాబాద్‌లో జరిగే ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు తమ నిరసన సెగ ఏంటో చూపెడతామని ఎమ్ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. తెలుగు నేల మీద( ఏపీ, తెలంగాణ, కర్నాటకలో తెలుగు మాట్లాడే ప్రాంతాలు) జులై రెండో తేదీన సడక్ బంద్ నిర్వహిస్తామనీ, మూడో తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడతామని ప్రకటించారు. పెరేడ్ గ్రౌండ్లో జరిగే బీజేపీ బహిరంగ సభలోనూ తమ నిరసన ఎదుర్కోవాల్సిందేనని తెలిపారు. జరిగే పరిణామాలకు బీజేపీనే బాధ్యత వహించాలని హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్శీగుట్టలోని ఎమ్ఆర్పీఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 28 ఏండ్లుగా ఉమ్మడి ఏపీ నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ చేస్తున్న ప్రతి పోరాటానికీ బీజేపీ నేతలు మద్దతు తెలిపారనీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవట్లేదని విమర్శించారు. పూర్తిస్థాయిలో బలమున్నా పార్లమెంట్లో ఎస్సీవర్గీకరణ బిల్లు ఎందుకు పెట్టట్లేదని ప్రశ్నించారు. ఆ పార్టీకి నిజాయితీ, చిత్తశుద్ధి ఉన్నట్లయితే వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని నిర్దిష్ట హామీ ఇవ్వడంతో పాటు స్పష్టమైన కాలపరిమితితో ముందుకు రావాలని కోరారు. ఇప్పటి వరకూ ఇచ్చిన మాటపై నిలబడలేం అనుకుంటే మాదిగలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత తమదైన పద్ధతిలో పోరాటం చేస్తామన్నారు. బడ్జెట్‌పై రూపాయి భారం పడకున్నా వర్గీకరణపై కేంద్రం ఎందుకు తాత్సారం చేస్తుందో అర్థం కావడం లేదని చెప్పారు. యూపీలో వర్గీకరణ హామీ సాధ్యమైన ప్పుడు ఇక్కడెందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. కర్నాటకలో బీజేపీనే అధికారంలో ఉన్నప్పటికీ సదాశివన్ కమిషన్ నివేదికను ఎందుకు పెండింగ్‌లో పెట్టారని నిలదీశారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు రాగటి సత్యం మాదిగ, తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, రాష్ట్ర నాయకులు యాదయ్య, వీఎస్ రాజు, బీవీ వాసు, ఇటుక శ్రీకృష్ణ, డప్పు మల్లిఖార్జున్, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ అత్యవసర సమావేశం
ఎమ్మార్పీఎస్ అత్యవసర సమావేశం బుధవారం రాత్రి జరిగింది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న నాలుగు బృందాల పాదయాత్రలను మందకృష్ణమాదిగ నిలిపివేయించి పార్శీగుట్టలోని కార్యాలయానికి అందర్నీ రప్పించారు. వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జులై ఒకటో తేదీన జరిగే సడక్ బంద్, పెరేడ్ గ్రౌండ్ బీజేపీ బహిరంగ సభలో నిరసన తెలిపేందుకు ఇచ్చిన చలో హైదరాబాద్ పిలుపును జయప్రదం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించినట్టు తెలిసింది.