Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాఠశాలకు తాళం వేసిన మధ్యాహ్న భోజన కార్మికుడు
నవతెలంగాణ -కృష్ణ
తమకు బిల్లులు రాలేదని.. బిల్లులు మంజూరు చేస్తేనే తాళం తీస్తానంటూ మధ్యాహ్న భోజన నిర్వహణ కార్మికుడు పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లా కృష్ణ మండలం సుకుర్ లింగంపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తిమ్మప్ప ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికుడిగా పని చేస్తున్నాడు. అయితే, కొంత కాలంగా మధ్యాహ్న భోజన నిర్వహణకు సంబంధించిన బిల్లులు అందలేదు. అధికారుల తీరుపై విసుగు చెందిన తిమ్మప్ప బుధవారం పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారు. మొత్తం బిల్లులిచ్చే వరకు తాళం తీయనని, అప్పులు చేసి మరీ విద్యార్థులకు భోజనం వండి పెడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. విషయాన్ని ఉపాధ్యాయుడు మండల విద్యాధికారికి సమాచారం అందించారు. వెంటనే ఎంఈఓ లక్ష్మి నారాయణ, క్లస్టర్ హెడ్ మాస్టర్ నిజామొద్దిన్, సీఆర్పీ అమీన్ రెడ్డి, ఉపాధ్యాయులు నరేష్ పాఠశాలకు వచ్చారు. కార్మికుడితో మాట్లాడి సమస్యను తెలుసుకుని పై అధికారులకు నివేదించి బిల్లులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో తాళం తీశాడు. దీంతో విద్యార్థులకు తరగతి గదుల్లో పాఠాలు బోధించారు.