Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలస్యంగా వెలుగులోకి సీఈవో బాగోతం
- ఎరువుల అమ్మకం, సిబ్బంది పీఎఫ్ డబ్బు స్వాహా
నవ తెలంగాణ-దుబ్బాక
వ్యవసాయ సహకార సంఘం సీఈఓ రూ.32 లక్షల పైచిలుకు నిధులను స్వాహా చేసిన సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో చోటుచేసుకుంది. ఈ అవకతవకలను బుధవారం స్పెషల్ ఆఫీసర్లు, సీనియర్ ఇన్స్పెక్టర్ ఆడిటర్ ఎల్.రాజశేఖర్ వర్మ, అసిస్టెంట్ రిజిస్టర్ విచారణ అధికారి వి.శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ షేర్ల కైలాష్, వైస్ చైర్మెన్ కాల్వ నరేష్ విలేకర్లకు వివరించారు. దుబ్బాక పురపాలిక పరిధిలోని చెల్లాపూర్ వార్డుకు చెందిన అమ్మన లక్ష్మారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో కొన్నేండ్లుగా సీఈవోగా పని చేస్తున్నాడు. 2019-20 కరోనా సమయంలో రూ.32 లక్షల విలువైన ఎరువుల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులు, సంఘంలో పని చేస్తున్న సిబ్బందికి సంబంధించిన పీఎఫ్ డబ్బులు రూ.2.70 లక్షల పైచిలుకు సంఘం బ్యాంకు ఖాతాలో జమ చేయకుండా వాటిని లక్ష్మారెడ్డి తన సొంతానికి వాడుకున్నారు. వార్షిక లెక్కల్లో తేడాలు గమనించిన ఆడిట్ అధికారులు జిల్లా సహకార సంఘం అధికారి జి.చంద్రమోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు రికవరీ కింద లక్ష్మారెడ్డికి నోటీసులు పంపారు. ఈ మేరకు బుధవారం పీఏసీఎస్ పాలకవర్గం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి అమ్మన లక్ష్మారెడ్డిని విధుల నుంచి తొలగించినట్టు ప్రకటించారు. తాత్కాలిక సీఈఓగా మాస్తి మోహన్‌ను నియమించినట్టు తెలిపారు. పీఏసీఎస్ డైరెక్టర్లు, సిబ్బంది ఉన్నారు.