Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరిక
- కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి...
- టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి నేతలు
- కమలం పార్టీలో ఇమడలేకపోతున్న నాయకులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సాధారణ ఎన్నికలు, ముందస్తు ఎన్నికల సంగతెలా ఉన్నా...రాష్ట్ర రాజకీయాల్లో నాయకుల గోడ దూకుడు మాత్రం షురూ అయింది. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కు, టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్పార్టీలోకి మారే ఆట మొదలైంది. పార్టీ నాయకులపై అసంతృప్తితోనో, తమను గుర్తించడంలేదనో, గ్రూపులు, అంతర్గతపోరుతోనో, తిరిగి బీఫామ్ వస్తుందో, రాదో అనే మీమాంసతోనో జంపుజిలానీలు పక్క పార్టీల వైపు చూపు చూస్తున్నారు. పార్టీకి ఎంతో విశ్వాసపాత్రులుగా పేరు తెచ్చుకున్న నేతలు సైతం హద్దులు దాటుతున్నారు. ఏండ్లపాటు పదవులు అనుభవించిన నాయకులు కూడా అభద్రతాభావంతో తక్కెడలో కప్పల మాదిరిగా ఎగిరిపోతున్నారు. టీఆర్ఎస్పై తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోతున్న 40 ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగురవేస్తారంటూ సోషల్‌మీడియా కోడై కూస్తున్నది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, నిర్మల్ జెడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి కాంగ్రెస్‌లో చేరడం దుమారాన్ని లేపింది. ఖైరతాబాద్ కార్పొరేటర్, పీజేఆర్ కూతురు విజయారెడ్డి కూడా ఇటీవల రేవంత్‌ను కలిశారు. గురువారం హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. టీఆర్ఎస్ మరో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మంత్రి కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. అయితే ఆయన వైఎస్ఆర్టీపీలో చేరుతారనే ప్రచారం కొనసాగుతున్నది. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షులు షర్మిలతో మంతనాలు జరిపినట్టు తెలిసింది. కొన్నేండ్లుగా కాంగ్రెస్‌పై అసంతృప్తితో అంటీ ముట్టనట్టు ఉంటున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా కమలదళంలో చేరేందుకు పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్‌ను వీడితే ఆయన రాజకీయంగా సమాధి అవుతారంటూ సన్నిహితుల చెబుతున్నా బీజేపీవైపే మొగ్గుచూపుతున్నారు. తాజాగా ఆపార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో కలిసి ఆయన అమిత్‌షాతో భేటీ అయినట్టు సమాచారం. రాష్ట్రంలో ఇతర పార్టీల నేతలను చేర్చుకునేందుకు బీజేపీ ప్రత్యేకంగా ఓటీమ్నే రంగంలోకి దించింది. జానారెడ్డి అధ్వర్యంలో కాంగ్రెస్ చేరికల కమిటీనే నియమించింది. మరోవైపు ఇప్పటికే ఆయా పార్టీల నుంచి కమలదళంలో చేరిన సీనియర్ నేతలు సైతం ఇమడలేక పోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాఈ క్రమంలోనే బీజేపీ నేత బండ్రు శోభారాణి హస్తం పార్టీలో చేరారు. టీఆర్ఎస్కు మేమే ప్రత్యామ్నాయంటూ ఆర్భాటం చేస్తున్న కమలనాథులకు ఇలాంటి రాజకీయ పరిణామాలు మింగుపడటం లేదని ఆ వర్గాలు అంటున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ వరుస పరాజయాలతో సత్తువ కోల్పోయి లేవలేని పరిస్థితులు నెలకొన్నాయి. రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ పార్టీకి కొత్త ఊపొచ్చింది. ఆ పార్టీ నుంచి వలసలు ఆగిపోయాయి. కానీ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో భారీ వలసలు ఎటు నుంచి ఎటువైపు పోతాయనే ప్రశ్న విశ్లేషకులను తొలిచి వేస్తున్నది. ఏ పార్టీకి ఊపు వస్తే ఆ పార్టీ గూటికి భారీ వలసలు ఉండే అవకాశం ఉందని సీనియర్ నాయకులు చెబుతున్నారు.