Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్నదాతలకు అన్యాయం
- ఐదేండ్లగా సడలించని కేంద్రం
- 2019 తర్వాత రిజిస్ట్రేషన్ అయిన భూములకు వర్తించని వైనం
- ఆప్షన్ ఇవ్వని బీజేపీ సర్కారు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) నియమ, నిబంధనలు రైతులకు తీరని అన్యాయం చేస్తున్నాయి. ఆ పథకంలో పొందుపరిచిన షరతులే ఇందుకు కారణమని చెప్పొచ్చు. 2018 డిసెంబర్లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించింది. 2019 కంటే ముందు రిజిస్ట్రేషన్ అయిన భూములే పీఎం కిసాన్ పరిధిలోకి వస్తాయి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అయిన భూములకు ఈ పథకం వర్తించబోదనే నిబంధన ఐదేండ్లుగా కేంద్రం సడలించకపోవడంతో కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. అయితే ఐదెకరాల లోపు రైతులకే పీిఎం కిసాన్ పథకం వర్తిస్తున్నది. లబ్దిదారులకు రెండువేల చొప్పున ఏడాదంతా ఆరువేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. ఈ పథకంలో దేశ వ్యాప్తంగా పది లక్షల మంది లబ్దిపొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది రైతులకు వర్తిస్తున్నది. కానీ ఎంతో మంది రైతులకు వారసత్వంగా వచ్చిన భూములు 2019 రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటికీ ఈ పథకానికి దూరంగా ఉంటున్నారని రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలానికి చెందిన యువ రైతు బండి చంద్రమౌళి చెప్పారు. ఎన్ని సార్లు మీసేవకు పోయి అడిగినా ఆప్షన్ లేదని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త దరఖాస్తులకు కేంద్రం ఆప్షన్ ఇవ్వకపోవడంతో ఐదెకరాల భూములున్న రైతులకు అన్యాయం జరుగుతున్నది. ఆప్షన్ కోసం రైతులు ప్రతి రోజు మీ సేవ కేంద్రాల చుట్టు తిరుగుతున్నారు. రైతుల శ్రేయస్సే లక్ష్యంగా కేంద్రం పని చేస్తున్నదంటూ చెబుతున్న పాలకులు...పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో మార్పులు చేయలేని దుస్థితిలో ఉందని రైతులు చెబుతున్నారు. పీఎం దరఖాస్తు పూర్తి చేసేందుకు సమగ్ర సమాచారాన్ని పొందుపరిచిన కేంద్రం...అందులోనే కొత్త వారి కోసం ఆప్షన్ ఇవ్వడం ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేదని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పథకం రూపకల్పనలోనే షరతు పెట్టడంతోనే బీజేపీ చిత్తశుద్ది అర్థమవుతున్నది. 'నీవు కొట్టినట్టు చేయి...నేను ఏడ్చినట్టు చేస్తా' అని కూడబల్కున్నట్టు కేంద్ర వ్యవహారం ఉన్నది. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఈ నిబంధనల రైతుల పాలిట శాపంగా మారింది. ప్రతియేటా పది లక్షల కుటుంబాలకు రూ 27వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను సడలించడం లేదనే విమర్శలొస్తున్నాయి.