Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుల మతాల పేరుతో శాంతిభద్రతల ముప్పుకు కుట్ర
- ఒక్క ఛాన్స్ ఇవ్వాలనడం హాస్యాస్పదం: ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
నవ తెలంగాణ-జహీరాబాద్
దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన జహీరాబాద్‌లోని బాగారెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో కుల మతాల మధ్య చిచ్చుపెట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 50 ఏండ్లు దేశాన్ని పాలించిన ఓ పార్టీ ఒక్క ఛాన్స్ ఇవ్వండని ప్రజలను వేడుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. భారతదేశంలో 24 గంటలపాటు ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రూ.200 ఉన్న పెన్షన్‌ను రూ.2016, రూ.500 ఉన్న వికలాంగుల పెన్షన్ రూ.3,016 పెంచి ప్రతి నెలా క్రమం తప్పకుండా ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో 973 గురుకుల పాఠశాలల్లో ఐదు లక్షల మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. విద్యార్థులకు రూ.20 వేల కోట్ల ఫీజురీయింబర్స్‌మెంట్ చెల్లించినట్టు తెలిపారు. మున్సిపాలిటీల్లో కార్మికులకు రూ.12 వేల జీతం ప్రతినెలా చెల్లిస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్‌కు దీటుగా సరిహద్దు ప్రాంతంలోని జహీరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ రూ.50 కోట్లు కేటాయించారని తెలిపారు. టీయూఎఫ్‌ఐడీ నిధుల నుంచి మరో రూ.34 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. విలీన గ్రామాల అభివృద్ధికి మరో రూ.56 కోట్లు అదనంగా మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. నియోజకవర్గంలో సంగమేశ్వర బసవేశ్వర పథకం ద్వారా 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు గోదావరి జలాలను తీసుకొస్తామన్నారు. నిమ్జ్‌లో డిఫెన్స్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమల నిర్మాణం చేస్తామన్నారు. ఈ పరిశ్రమలు ప్రారంభమైతే వేల మంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.
మహేంద్ర అండ్ మహేంద్ర మూడు లక్షల ట్రాక్టర్ల ఉత్పత్తిని దాటడం హర్షించదగ్గ విషయమన్నారు. త్వరలోనే జహీరాబాద్ పట్టణంలోని ఐడీఎస్ఎన్టీ పథకానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం మెప్మా గ్రామ సమైక్య సభ్యులకు రూ.52.40 కోట్ల రుణ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, మదన్‌రెడ్డి, శాసనసభ్యులు మైపాల్‌రెడ్డి, చంటి క్రాంతి కిరణ్, గ్యాదరి బాలమల్లు, కలెక్టర్ శరత్, డిప్యూటీ కలెక్టర్ వీరారెడ్డి, డీసీఎంఎస్ చైర్మెన్ శివ కుమార్, కిషన్, విజరు కుమార్, ఎల్లయ్య, రమేష్ బాబు, దేవేందర్ రెడ్డి, కమిషనర్ సుభాష్ రావు దేశ్‌ముఖ్, డీఎస్పీ రఘు, నాయకులు సుభాష్, నరసింహులు, మురళి కృష్ణగౌడ్, వైద్యనాథ్, జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.