Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీడీ కార్మికుల ఐక్య పోరాటాలతోనే పెరిగిన వేతనాలు
బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్లయ్య, ఎస్వి రమ
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల వేతన ఒప్పందంపై చర్చలు సఫలం అయినట్టు బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్లయ్య, ఎస్వి.రమ తెలిపారు. బీడీలు చుట్టే కార్మికులు, బీడీ ప్యాకర్లు, బట్టీవాలా, చెన్నివాలా, బీడీ చటన్, ట్రై పిల్లర్, క్లర్క్స్ మొదలగు కేటగిరీలకు చెందిన కార్మికులకు వేతనాలు పెరగనున్నట్టు చెప్పారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 30.04.2022తో పాత వేతన ఒప్పందం ముగిసినట్టు చెప్పారు. నూతన వేతనం ఒప్పందం కోసం బీడీ కార్మిక సంఘాలతో బీడీ మాన్యుఫ్యాక్షర్ యాజమాన్య సంఘంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గుజరాత్ భవన్లో చర్చలు జరిగాయన్నారు. ఈ చర్చల్లో బీడీ ప్యాకర్లకు నెలకు రూ.2800, నెలవారి జీతం ఉద్యోగులకు రూ.1500 చొప్పున వేతనం పెంచగా, బీడీలు చుట్టే కార్మికులకు వెయ్యి బీడీలకు మూడు రూపాయల (3/-) చొప్పున కూలి రేట్ల పెంపునకు అగ్రిమెంట్ కుదిరినట్టు తెలిపారు. కొత్త అగ్రిమెంట్ 01.05.2022 నుంచి 30.04.2024 వరకు అమల్లో ఉండనున్నట్టు చెప్పారు. పెరిగిన వేతనం మే నెల బకాయిలు వచ్చే ఆగస్టులో ఇవ్వాలని అగ్రిమెంటు కుదిరినట్టు తెలిపారు. బీడీ కార్మికుల, ప్యాకర్లు, ఉద్యోగుల ఐక్యత వల్లే కూలి రేట్లు పెరిగాయన్నారు. ఐక్యతతోనే విజయాలు సాధ్యమని, భవిష్యత్లో ఇదే ఐక్యతను కొనసాగించాల్సిన అవసరముందని చెప్పారు. కార్మికుల ప్రయోజనాలను కాపాడిన సంఘాలకు అభినందనలు తెలియజేశారు.
ఈ చర్చల్లో తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కార్యదర్శి ఎస్వి రమ, అధ్యక్షులు ఎల్లయ్య, నాయకులు నూర్జహాన్, బీడీ ప్యాకర్స్ జిల్లా నాయకులు జమీల్, బాలమణి, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరేందర్, బీడీ యజమానుల సంఘం అధ్యక్షులు ఇతేంద్ర ఉపాధ్యాయ, దేశారు బీడీ ప్రొడక్షన్ మేనేజర్ రష్మీకాంత్ పటేల్, టీఆర్ఎస్కేవీ బాధ్యులు నర్సింలు, బీఎంఎస్ రాష్ట్ర బాధ్యులు కలాల్ శ్రీనివాస్, ఏఐఎఫ్టీయు నాయకులు అనసూయ, లింగం, బిఎల్టీయు రాష్ట్ర కార్యదర్శి సిద్దిరాములు, ఇతర సంఘాల నాయకులు స్వామి, టీ. బాల్ రాజ్, మురళి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.