Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తేలని కృష్ణా జలాల వివాదం !
- రాష్ట్రం వాటా ప్రశ్నార్థకమే ?
- ఆందోళనలో సాగునీటిరంగ నిపుణులు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కృష్ణా యాజమాన్య నిర్వహణ బోర్డు (కేఆర్ఎంబీ) ఏర్పాటు చేసిన రిజర్వాయర్ల మేనేజ్మెంట్ కమిటీ(ఆర్ఎంసీ) మూడో సమావేశం పదే పదే వాయిదా పడుతున్న నేపథ్యంలో కృష్ణా జలాల కేటాయింపు సమస్య ఎప్పటికప్పుడు పెండింగ్‌లో పడుతున్నది. ఈనెల 16 జరగాల్సి ఆర్ఎంసీ భేటి మరోసారి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ భేటిని ఈనెల 28న నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు సాగునీటిశాఖ అధికారుల అధికారిక సమాచారం. గతంలో జరిగిన రెండు సమావేశాలకు తెలంగాణ సాగునీటి పారుదల అధికారులు గైర్హాజరయ్యారు. వానాకాలం ముందస్తు సన్నాహాక ఏర్పాట్లల్లో ఉన్న కారణంగా ఆర్ఎంసీ సమావేశాలను జూన్ 16న నిర్వహించాలని గతంలో రాష్ట్ర సాగునీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.మురళీధర్ కృష్ణా బోర్డుకు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రిజర్వాయర్ల నిర్వహణపై తెలంగాణ అభిప్రాయాలను వినేందుకు బోర్డు ఈనెల 16న సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, ఏపీ అధికారులు రాకపోవడంతో అది కూడా జరగలేదు. ఆర్ఎంసీ ఉద్దేశ్యాలు, సమావేశంలోని ఎజెండా కీలకంగా మారడంతో మూడోసారి జరిగే సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రంలోని కృష్ణా జలాలను 50:50 శాతం ప్రాతిపదికన పంపిణీ చేయాలని రాష్ట్రసాగునీటి పారుదల శాఖ కేఆర్ఎంబీకి స్పష్టం చేస్తున్నది. ఈ విషయంలో పదే పదే లేఖలు రాసింది. తాత్కాలికంగా అంటూ ప్రతి నీటి ఏడాదిలో కృష్ణా జలాలను 66:34 శాతం ప్రాతిపదికన కేటాయించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. శ్రీశైలం నుంచి ఏపీ 34 టీఎంసీలకు మించి తరలించకుండా నియంత్రించాలని బోర్డును తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది. కాగా ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో కృష్ణాలో నీటి లభ్యత పెరిగే అవకాశం ఉంది. వరద జలాలతో రిజర్వాయర్లు నిండితే ఈ సారీ కూడా తెలంగాణకు 34 శాతం నీటి వాటా మాత్రమే దక్కే ప్రమాదముందని నీటిపారుదలరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆందోళన చెందుతున్నారు.
నిజానికి ఆర్ఎంసీ సేకరించాల్సిన అభిప్రాయాల్లో ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వాటా ఎజెండా కూడా ప్రధానమైంది. ఈ జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు ఉమ్మడి ప్రాజెక్టుల్లో విద్యుదత్పత్తి, నీటి నిల్వ, విడుదల ప్రక్రియ, వరద దినాల్లో మళ్లించిన నీటిని కోటా కింద కేటాయించాలా? వద్దా? అన్నవే ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై నివేదిక ఇచ్చే బాధ్యతను ఆర్‌ఎంసీకి గతంలోనే కేఆర్ఎంబీ అప్పగించింది.
ఈ ఏడాది నీటి సంవత్సరం ప్రారంభానికి ముందు ఈ అంశాన్ని పరిష్కరించాల్సిన పరిస్థితుల్లో ఆర్ఎంసీ సమావేశం పడటంతో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు అసంతృప్తితో ఉన్నారు. తాజాగా ఈనెల 28న ఆర్ఎంసీ సమావేశాన్ని మరోసారి నిర్వహించేందుకు కేఆర్ఎంబీ సన్నద్ధమవుతున్నది.
ఈ భేటికి సంబంధించిన ఆహ్వానాన్ని ఒకటి, రెండు రోజుల్లో ఇరు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్‌లకు కేఆర్ఎంబీ పంపనుంది. ఇప్పటికే ఎజెండా అంశాలు ఖరారైన నేపథ్యంలో సమావేశం నిర్వహించడమే మిగిలి ఉంది. ఇదిలావుండగా ఆర్ఎంసీ మూడో సమావేశానికైనా ఇటు తెలంగాణ, అటు ఏపీ ఇరిగేషన్ అధికారులు హాజరవుతారా ? లేదా ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.