Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇందిరాప్రియదర్శిని డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ నిర్వాకం
- ఫీజు కట్టినా హాల్టికెట్లు రాని వైనం
- పరీక్షలకు హాజరుకాలేక మనోవేదన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డిగ్రీ ఫెయిలైన విద్యార్థుల భవిష్యత్తు ఆగమైంది. హైదరాబాద్లోని ఇందిరాప్రియదర్శిని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ నిర్వాకంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. విద్యార్థుల తప్పు లేకపోయినా మానసిక వేదనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఓయూ పరిధిలో డిగ్రీ విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే ఫెయిలైన విద్యార్థులు ఆయా సబ్జెక్టులకు సంబంధించి ఫీజు కట్టినా హాల్టికెట్లు రాకపోవడం గమనార్హం. దీంతో వారు పరీక్షలకు హాజరుకాలేక పోవడం వల్ల మానసికంగా వేదనకు గురవుతున్నారు. గతేడాది జరిగిన సెమిస్టర్ పరీక్షలు రాసి ఫెయిలైన విద్యార్థులకు మళ్లీ ఆర్నెళ్ల తర్వాత బ్యాక్లాగ్ పరీక్షలు రాసే అవకాశం ఇప్పుడు వచ్చింది. ఆ పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థులు ఫీజు కట్టారు. ఈనెల 21 నుంచి ఓయూ పరిధిలో డిగ్రీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే ఇందిరాప్రియదర్శిని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదివిన సగం మంది విద్యార్థులకు హల్ టికెట్లు వచ్చాయి. సుమారు 51 మంది విద్యార్థులకు హల్ టికెట్లు రాలేదు. కళాశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో దీన్ని బట్టి అర్థమవుతున్నది. ఇదేంటని విద్యార్థులు ప్రశ్నిస్తే మూడు నెలల తర్వాత జరిగే పరీక్షలకు హాజరు కావాలంటూ ఆ కాలేజీ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా సమాధానమివ్వడం విద్యార్థులను మరింత ఆందోళనకు గురిచేసింది. ఇప్పటికే రాష్ట్రంలో పీజీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆలస్య రుసుం లేకుండా వచ్చేనెల నాలుగో తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు అవకాశమున్నది. ఇప్పటికే కొందరు విద్యార్థులు దరఖాస్తు చేశారు. అయితే ఇప్పుడు జరిగే సెమిస్టర్ పరీక్షలకు హాజరైతేనే ఆ విద్యార్థులు డిగ్రీలో ఉత్తీర్ణులై పీజీ కోర్సుల్లో చేరేందుకు అవకాశముంటుంది. కానీ మూడు నెలలు ఆగి డిగ్రీ పరీక్షలు రాయటం వల్ల ప్రస్తుత విద్యాసంవత్సరంలో పీజీలో చేరే అవకాశం కోల్పోతారు. దీంతో ఏడాది నష్టపోతామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓయూ, ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ యాజమాన్యం కచ్చితంగా బాధ్యత వహించి పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. వెంటనే హల్ టిక్కెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే అందరికీ హల్ టిక్కెట్లు ఇచ్చే వరకు పరీక్షలను ఆపాలని విజ్ఞప్తి చేశారు.
మాకు న్యాయం చేయాలి : హస్మిత, విద్యార్థిని
సకాలంలో ఫీజు చెల్లించి హాల్టికెట్లు రాని విద్యార్థులకు న్యాయం చేయాలి. మా తప్పు లేకపోయినా శిక్ష వేయడం ఎంత వరకు సమంజసం. హాల్టికెట్లు రాకపోవడానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. ఇందిరాప్రియదర్శిని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా మూడు నెలల తర్వాత జరిగే పరీక్షలకు హాజరు కావాలని సమాధానం చెప్పడం సరైంది కాదు. విద్యాసంవత్సరం కోల్పోకుండా ఓయూ అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.