Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయోగాత్మక సాగు ఎవరి కోసం?
- ఎకరాకు 2 ప్యాకెట్ల బదులు మరో 3 ప్యాకెట్లు అదనం
- ఆ ఖర్చు రైతు భరించాలా? ప్రభుత్వమా?
- పంట నష్టపోతే బాధ్యత ఎవరిది? పరిహారం ఇస్తారా?
- రాశి, నూజివీడు కంపెనీలు ఇస్తాయా? సర్కారు ఇస్తుందా?
- వరి పండే నిజామాబాద్‌లో పత్తి పంటేంటి?
- ఎవరి ప్రయోజనం కోసం రైతులపై ఒత్తిడి...?
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని సగం సాగు భూమిలో పత్తి పంట పండించాలంటూ సర్కారు రైతులకు అవగాహన కల్పిస్తున్నది. వాణిజ్య పంటైన పత్తికి ఇబ్బడిముబ్బడిగా రసాయినిక ఎరువుల వాడకంలో భూమి సత్తువ కోల్పోతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో నూనెగింజలు, ఆహారధాన్యాలు, పప్పుదినుసుల పంటల సమతుల్యత దెబ్బతింటుందనే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఆ రకమైన పత్తి సాగు (ఒకేసారి పూత, ఒకేసారి కాత...వెరసీ రెండు,మూడు సార్లు తెంపడం అయిపోతుంది) అంటూ ప్రచారం చేస్తున్నది. అన్ని జిల్లాల్లో 20వేల ఎకరాల్లో ప్రయోగాత్మకంగా అల్ట్రా హైడెన్సిటీ పత్తి సాగు చేయాలని రైతులపై ఒత్తిడి పెంచుతున్నారు. తద్వారా సాధారణ పత్తి దిగుబడి కంటే 30 శాతం నుంచి 40 శాతం అధిక దిగుబడి వస్తుందని చెబుతున్నారు. ఈ పంట 142 నుంచి 150 రోజుల్లో పంట చేతికొస్తుంది, సాధారణ పత్తి 162 నుంచి 180 రోజుల్లో పంట వస్తుంది. దాదాపు నెలరోజుల కాల పరిమితి తగ్గుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా రెండో పంట వేసుకునే అవకాశం రైతుకు ఉంటుందని సెలవిస్తున్నారు. సాధారణంగా ఎకరాకు 7400 మొక్కల సామర్థ్యం ఉంటుంది. కానీ అల్ట్రా హైడెన్సిటీ విధానంలో 25వేల మొక్కల సామర్థ్యాని కలిగి ఉంటాయి. సాధారణంగా పత్తి సాగు చేసుకుంటే ఎకరాకు రెండు ప్యాకెట్లు సరిపోతాయి. ఈ విధానంలో మరో మూడు ప్యాకెట్లు అదనంగా అవసరం అవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విత్తనాలను రాశి (665 రకం), నూజివీడు ( సిరి, కార్మిక, విన్నర్ రకాలను) పరిశోధించి సిద్ధం చేసినట్టు ప్రభుత్వం చెబుతున్నది. 20వేల ఎకరాలకు సరిపడిన పత్తి విత్తనాలను ఆ రెండు కంపెనీలు అభివృద్ధి చేశాయనీ, ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ 729లకు అక్కడే కొనాలని చెబుతున్నది. ఈ లెక్కన రైతులపై రూ 72.90 కోట్ల భారం పడుతున్నది. ఆయా కంపెనీలు ప్రభుత్వం నిర్ణయించిన ధర కాకుండా ఒక్కొక్క ప్యాకెట్‌ను రూ 810కు అమ్ముతున్నట్టు తెలిసింది. దీంతో రూ 81 కోట్లు పెట్టి రైతులు కొనాల్సి వస్తున్నది. సింగిల్పిక్కింగ్ పేరుతో భారీ ఎత్తున ప్రోత్సహిస్తున్న సర్కారు... అల్ట్రా హైడెన్సిటీ పద్దతికి ఎకరాకు నాలుగువేలు ఇచ్చిన చేతులు దులుపుకుంటున్నది. గులాబీ రంగు తెగులు సోకి పత్తి రైతులు నష్టపోతున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్న వ్యవసాయశాఖ...కొత్త పద్దతిలో సాగు రైతలకు కల్పిస్తున్న ప్రయోజనం ఏంటో అర్థం కావడంలేదు. ఈ క్రమంలో రాశి, నూజివీడు కంపెనీలు పరిశోధించిన విత్తనాలను అమ్మేందుకు ప్రభుత్వం వకాల్తా పుచ్చుకున్నట్టు కనపడుతున్నది. చివరకు పురుగు మందులు కూడా ఆ రెండు కంపెనీల రసాయనిక ఎరువు(చమత్కార్) మాత్రమే వాడాలని చెబుతున్నది. అల్ట్రా హైడెన్సిటీ పత్తి సాగును కంపెనీల ప్రయోజనాల కోసమే ప్రోత్సహిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అకాల వర్షాలకు పంట నష్టపోతే ఎవరి బాధ్యతో చెప్పడం లేదు. ఇప్పటికే ఈ ప్రయోగం విఫలమైంది. అయినా వ్యవసాయ శాఖ ముందుకే సాగుతుండటంతో అనేక అనుమానాలు వస్తున్నాయి. అల్ట్రా హైడెన్సిటీ పత్తి విత్తనాల పేరుతో ఇప్పటికే వరంగల్‌లో రైతు నాగరాజుకు నకిలీ విత్తనాలు అమ్మారు. అలాంటప్పుడు ఆయా విత్తన కంపెనీలకు పత్తి విత్తన ఖరీదును ముందుగానే ప్రభుత్వం చెల్లిస్తే.. రైతుకు ఉచితంగా విత్తనం అందుతుంది. అప్పుడే రైతులు సాగు కోసం ముందుకు వస్తారు.
అధిక దిగుబడి వస్తుంది : రాంప్రసాద్, సీనియర్ శాస్త్రవేత్త
అల్ట్రా హైడెన్సిటీ విధానం ద్వారా అధికంగా పత్తి దిగుబడి వస్తుంది. ఎకరాలో ఎక్కువ మొక్కలు వస్తాయి. పూత, కాత ఒకేసారి రావడంతో పత్తి ఎరడం కూడా ఒకేసారి అయిపోతుంది. దీంతో రెండో పంట కూడా రైతులు వేసుకోవచ్చు. తెలికపాటి నేలల్లో కూడా ఎక్కువ దిగుబడి వస్తుంది. కాత, పూత నియంత్రణకు మందులు ఉపయోగించడం ఇందులో విశేషం.
అట్టర్ ప్లాప్ షో అభ్యుదయ రైతు పురుషోత్తమ్‌రావు
అల్ట్రా హైడెన్సిటీ పత్తి సాగు అట్టర్ ప్లాప్ షో. వానాకాలం విజయవంతం కాదు. సాధారణ విత్తనాలతో పోలిస్తే మూడు ప్యాకెట్ల విత్తనాలు అదనంగా వాడాలి. ఆఖర్చు రైతుకు భారం. దీనికి ఎక్కడా ధృవీకరణ చేయలేదు. సమగ్ర నివేదికలు లేవు. వరి ఎక్కువగా పండే నిజామాబాద్ జిల్లాను సర్కారు దీనికి ఎంపిక చేసింది. ఆ రెండు కంపెనీల విత్తనాలనే ఉపయోగించాలని చెప్పడంలో అంతర్యమేంటో అర్థం కావడం లేదు.