Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి నెలా గర్భిణీలను గుర్తించి పైకి సమాచారం పంపాల్సిందే
- పరీక్షలుంటే వీరికే విధులు..టీకాల బాధ్యతా వీరిదే
- హెల్త్ సర్వేపై రోజువారీ టార్గెట్లు..తలనొప్పిగా ఎంట్రీలు
- ప్రతి వారమూ జూమ్ మీటింగ్‌లో పాల్గొనాల్సిందే
- ఉదయం నుంచి రాత్రి వరకూ తీవ్ర పనిభారం..ఆపై టెన్షన్
- నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆశాల నిరసనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రోజువారీ టార్గెట్లు పూర్తికాక, ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక..ఆరోగ్యం పాడుచేసుకుని ఆశా వర్కర్లు కుప్పకూలిపోతున్నారు. సర్వేలు, రోజువారీ విధుల పేరిట తిరిగితిరిగి సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఇటీవలి కాలంలోనే రాష్ట్రంలో పదిమందికిపైగా ఆశా వర్కర్లు చనిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ప్రాణాలను ఫణంగా పెట్టి ఆదివారం కూడా సెలవు లేకుండా రేయింబవళ్లు గొడ్డుచాకిరీ చేస్తున్న ఆశాలకు దక్కుతున్నది ఉన్నతాధికారుల తిట్లే. ''టార్గెట్ ఎందుకు రీచ్ కాలేదు? సిగ్గుశెరం లేదా? ఉప్పుకారం తింటలేరా?.....ఎందుకిట్ట జేస్తున్నరు? జెర ఉప్పుకారం ఎక్కువ తినండి. గట్టిగ పనిచేయండి'' అంటూ ఓ అధికారి అనరాని మాటలు అన్నారని హైదరాబాద్‌కు చెందిన ఆశా వర్కర్ గోడు వెళ్లబోసుకున్నదంటేనే వేధింపుల పర్వం ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్ర వ్యాప్తంగా 28 వేల మంది సామాజిక ఆరోగ్య కార్యకర్తలు(ఆశాలు)న్నారు. గర్భిణీలను గుర్తించడం, వారు ప్రతినెలా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకునేలా సూచనలు చేయడం, ప్రభుత్వాస్పత్రుల్లో చూపించుకుని సహజప్రసవాలు అయ్యేలా ప్రోత్సహించడం, చిన్నపిల్లలకు సకాలంలో టీకాలు వేయడం, ఇళ్లిల్లూ తిరిగి వేయించుకోని వారిని గుర్తించి వారికి వేయడం.. ఇలా చెప్పుకుంటూ పోతే వీరి పని చాతాండత ఉంటుంది. అర్ధరాత్రి గర్భిణీలకు నొప్పులొస్తే వారిని తీసుకుని ఆస్పత్రులకు ఉరకాల్సిందే. ఇలా 24 గంటలూ విధులు చేపట్టాల్సిందే. ఇంత చేసినా తన పరిధిలో ప్రతి నెలా కనీసం రెండు డెలివరీలు ప్రభుత్వాస్పత్రిలో అయ్యేలా చూడాలి. అలా చేయకుంటే వారు పనిచేయని జాబితాలోకి వెళ్తారు. ప్రతిరోజూ ఇల్లిల్లూ తిరుగుతూ ఎవరు ప్రెగెన్సీ అయ్యారు? అనేది రెండు నెలలోపే గుర్తించి రికార్డులో నమోదు చేయాలి. ఒకవేళ అలా గుర్తించని పక్షంలో మీరు పనిచేయట్లేదని అధికారుల అక్షింతలకు గురవుతున్నారు. క్షేత్రస్థాయిలో గర్భిణీలుగానీ, ప్రజలుగానీ వీరిని చాలా గౌరవిస్తారు. అయితే, వారిని ఆస్పత్రులకు తీసుకెళ్లిన సమయంలో అక్కడే అశాలను ఉన్నతాధికారులు చెడామడా తిట్ల దండకంతో ఏకిపారేస్తుండటంతో అవమానాల పాలవుతున్నారు. 'నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయ్యి పదిరోజులు కూడా కావట్లేదు. నీరసంగా ఉంటున్నది. ఆపరేషన్ చేయించుకున్న నాలుగైదు రోజుల నుంచే డ్యూటీకి రావాలని అధికారులు టార్చర్ పెట్టడంతో విధిలేక వస్తున్నాను. వాళ్ల ఇండ్లల్లో ఎవరికైనా ఇలాగైతే అట్టాగే చేస్తారా?' అంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ ఆశావర్కర్ విలపించింది.
రోగులందరికీ మాత్రలివ్వాల్సిందే..టీబీ రోగుల ఉమ్మి మోయాల్సిందే..
ఎవరికైనా టీబీ వ్యాధి ఉన్నట్టు అవమానం ఉంటే వారిని ఆశాలు ఆస్పత్రులకు రెఫర్ చేసేవారు. అక్కడ టెక్నీషియన్లు ఉమ్మిని సేకరించి నిరార్ధించేవారు. ఇటీవలి కాలంలో టీబీ లక్షణాలు ఉన్నవారి సంఖ్య బాగా తగ్గింది. ఆస్పత్రులకు వచ్చేవారి సంఖ్య కూడా తగ్గింది. అయితే టీబీ టీమ్పేరుతో టీబీ లక్షణాలున్న చోటకే ఆశావర్కర్లకు డబ్బాలు ఇచ్చి పంపుతున్నారు. ఉమ్మి సేకరించిన డబ్బాలను ల్యాబ్‌లను తీసుకెళ్తున్నారు. టెక్నీషియన్ సమక్షంలో రోగి నుంచి సేకరించాల్సిన ఉమ్మిని తామే సేకరించాలంటూ ఆదేశాలివ్వడంపై ఆశాలు గుర్రుగా ఉన్నారు. తమకు ఆ వ్యాధి ప్రబలే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఐరన్, కాల్షియం, రక్తహీనత, షుగర్, బీపీ రోగులను గుర్తించి వారికి క్రమం తప్పకుండా మాత్రం అందివ్వాలి. వారి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడూ ఉన్నతాధికారులకు రిపోర్టులు పంపాలి. పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, ఉద్యోగాల భర్తీ, ఇలా ఏ పరీక్షలు జరిగినా అక్కడ కచ్చితంగా ఆశా వర్కర్లు తమ కిట్లతో అందుబాటులో ఉండాలి. దీనికితోడు ప్రత్యేక కార్యక్రమాలు ఉండనే ఉంటాయి.
హెల్త్ సర్వే కోసం రోజూ 50 ఆధార్ కార్డుల వివరాలు సేకరించాలి
హెల్త్ సర్వేలో భాగంగా ఆశా వర్కర్లు ప్రతి రోజూ ఇల్లిల్లూ తిరగాలి. ప్రతి రోజూ ఒక్కొక్కరు 50 ఆధార్ కార్డులకు సంబంధించి ఆరోగ్యవివరాల సమాచారం పొందుపర్చాలి. ఇది ఆశాలకు తలకుమించిన భారమవుతున్నది. వాళ్లకిచ్చిన సెల్ఫోన్లు తక్కువ కాన్ఫిగరేషన్‌తో ఉండటం, సిగల్స్ సరిగా ఉండకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ వ్యక్తికి బీపీ, షుగర్, థైరాయిడ్ ఉన్నాయా? దీర్ఘకాలిక వ్యాధులేమైనా ఉన్నాయా? ఇంకేమైనా రోగాలతో బాధపడుతున్నారా? అయితే ఏ రోగం? ఎన్నేండ్ల నుంచి? మాత్రలు వాడుతున్నారా? అవి ఎలాంటివి?.. ఇలా ఒక్కో కార్డుకు సంబంధించి 42 నుంచి 60 ఎంట్రీలను పూర్తి చేయాలి. ఫొటోలు అప్లోడ్ చేయాలి. వెయ్యి మంది జనాభాకు సంబంధించిన వివరాలను వారంలో పూర్తి చేస్తే మళ్లీ మొదటి ఇంటి నుంచి సర్వే చేపట్టాలి. ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేయాలి. ఇలా సమాచార సేకరణ కోసం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండనకా, వాననకా తిరిగితిరిగి అడ్డం పడుతున్నారు. వారు అనారోగ్యం పాలైతే వ్యక్తిగత సమస్యగా చూస్తున్నారు. వారికే సహాయం చేయట్లేదు. అదే సమయంలో టార్గెట్లు పూర్తిచేయడం లేదనే పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు.
వేధింపులు ఆపాలి
- నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
ఆశాలపై పని ఒత్తిడి తగ్గించాలనీ, వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని ఆశాలకు పిలుపునిచ్చాం. సుజాత కుటుంబానికి న్యాయం చేయాలని అడిగితే అరెస్టులు చేయడం దుర్మార్గం. తీవ్ర పనిభారం, వేధింపులతో ఆశాలు అనారోగ్యాల పాలవుతున్నారు. టెన్షన్ తట్టుకోలేక కొందరు గుండెపోటుతో చనిపోతున్నారు. ఇటీవల కాలంలో పెద్దపల్లి జిల్లాలో ఒకరు, నిర్మల్ జిల్లాలో నలుగురైదుగురు, హైదరాబాద్‌లో ఇద్దరు చనిపోయారు. మిగతా జిల్లాల్లోనూ పలుచోట్ల మరణించారు. రోజు తప్పించి రోజు ఆశా వర్కర్ చావు వార్త వినాల్సి వస్తున్నది. సుజాత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి. పిల్లల చదువు బాధ్యతను రాష్ట్ర సర్కారే తీసుకోవాలి. ఆశాల ందరికీ హెల్త్ కార్డులివ్వాలి. పెండింగ్‌లో లేకుండా ప్రతి నెలా పారితోషికం అందేలా చూడాలి. సర్కారు ఇస్తానన్న రూ.9,750 ఎక్కడా అందట్లేదు. రూ.7 వేలకు మించి ఇవ్వట్లేదు. ఈ సమస్యనూ సర్కారు పరిష్కరించాలి.
- పి.జయలక్ష్మి, ఆశావర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు