Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ఫలితాలు శని లేదా ఆదివారం విడుదలయ్యే అవకాశమున్నది. ఈ దిశగా ఇంటర్ బోర్డు అధికారులు వేగంగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం కంప్యూటర్ ఆధారంగా కోడింగ్, డీకోడింగ్ పనులు జరుగుతున్నాయి. 2019 వార్షిక పరీక్షల్లో దొర్లిన తప్పుల వల్ల సుమారు 26 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇప్పుడు ఫలితాల్లో తప్పులు దొర్లకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అప్పుడు నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫారసులను ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తున్నారు. ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఫలితాలు ఒక రోజు ఆలస్యమైనా ఇబ్బంది లేదు, కానీ తప్పులు రాకుండా చూసుకోవాలి ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తనను కలిసిన విలేకర్లతో చెప్పారు. ఇంటర్ ఫలితాల విడుదలకు ఆహ్వానిస్తూ విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డికి శుక్రవారం ఇంటర్ బోర్డు విజ్ఞప్తి చేసే అవకాశమున్నది. గతనెల ఆరు నుంచి 24వ తేదీ వరకు రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 4,64,626 మంది, ద్వితీయ సంవత్సరంలో 4,42,767 మంది కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.