Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20మందికి అవార్డులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వికలాంగుల హక్కుల కోసం జీవితాంతం కృషి చేసిన హెలెన్ కెల్లర్ జయంతి ఉత్సవాలను నిర్వహించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ), హెలెన్ కెల్లర్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్లు సంయుక్తంగా నిర్ణయించాయి. ఈనెల 27న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉత్సవాలను నిర్వహిస్తామని ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె వెంకట్, ఎం అడివయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో వీటిని నిర్వహిస్తామని వారు వెల్లడించారు. ఇందులో భాగంగా వికలాంగుల సాంస్కృతిక ఉత్సవాలు, హెలెన్ కెల్లర్ స్మారక ఆవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలు ఉంటాయని వారు తెలిపారు. సంబంధిత వాల్పోస్టర్ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెలెన్ కెల్లర్ వికలాంగుల హక్కుల రక్షణ కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. మహిళలు, బాలికలు, వికలాంగులు, కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో రచనలు చేశారని పేర్కొన్నారు. బధిరుల విద్య అభివృద్ధి కోసం జీవితాంతం కృషిచేశారని తెలిపారు. ఆమె వారసత్వాన్ని కొనసాగించేందుకు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిరంతరం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. హెలెన్ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 20 మంది వికలాంగులు, అంధులు, బధిరులకు మెమోరియల్ అవార్డు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు .ఈ సందర్భంగా వికలాంగ కళాకారులతో ఆట పాట సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వికలాంగులలో దాగి ఉన్న కళా నైపుణ్యం వెలికితీసేందుకోసం ఈ ఉత్సవాలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. సమాజంలో వికలాంగుల పట్ల చిన్నచూపు కొనసాగుతుందనీ, దాన్ని నిర్మూలించేందుకు వికలాంగులను అన్ని రంగాల్లో భాగస్వామ్యం చేయాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ కోశాదికారి ఆర్ వెంకటేశ్ సభ్యులు రంగారెడ్డి, శశికళ పాల్గొన్నారు.