Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చట్టం ప్రకారం అర్హులకు పట్టా హక్కు కల్పించండి:
- సీఎం కేసీఆర్కు తెలంగాణ రైతుసంఘం లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో పోడు భూముల సమస్యలను పరిష్కారించాలనీ, 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులకు పట్టా హక్కులు కల్పించాలని తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈమేరకు గురువారం సీఎం కేసీఆర్కు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్రావు, టి సాగర్, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ లేఖ రాశారు. 'రాష్ట్రంలో రైతులు ధరఖాస్తు చేసుకుని ఎనిమిది నెలలు పూర్తైంది. పోడు సాగుదారులు ధరఖాస్తు చేసుకుంటే, భూమిపై హక్కులు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. స్వయంగా జోక్యం చేసుకుని ఆసమస్యను పరిష్కరిస్తామంటూ అనేక సందర్భాల్లో ప్రకటించారు. అఖిలపక్షాల తరుపున రాస్తారోకో చేసిన సందర్భంగా కూడా ప్రభుత్వం అర్హులను ధరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ హామీ నేపథ్యంలో 13 లక్షల ఎకరాలకు అర్హులైన రైతులు 3.5 లక్షల మంది ధరఖాస్తులు చేసుకున్నారు' అని పేర్కొన్నారు. వానాకాలం సీజన్ వచ్చిందనీ, ఇంత వరకు ప్రభుత్వం ధరఖాస్తులను పరిశీలన చేయలేదని పేర్కొన్నారు. అడవుల్లో నివసిస్తున్న పేదలు ప్రభుత్వం నుంచి హక్కు పత్రాలు రాకపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు లేకున్నా, ఫారెస్టు అధికారులు, పోలీసులు కలిసి సాగుకు ఆటంకం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. '1967 అటవీహక్కుల చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం అడవికి భూమిని ఇవ్వవలసిందిగా కొందరు ఫారెస్టు అధికారులు ధరఖాస్తు చేసుకున్నారు. కానీ చట్ట ప్రకారం ధరఖాస్తు చేసిన సంవత్సరంలోగా పరిష్కారం కావాలి. ధరఖాస్తులు చేసుకుని దశాబ్దాలు గడిచింది. అదే చట్టంలోని సెక్షన్ 5 నుంచి 15 వరకు అమలు చేసి, ఫారెస్టుకు భూమిని ఇవ్వాల్సి ఉంటుంది. సెటిల్మెంట్ అధికారిని నియమించి భూమిని సేకరించిన తర్వాత రెవెన్యూ శాఖ భూమిని ఫారెస్టుకు ఇవ్వాలి. కానీ చట్టాన్ని ధిక్కరించి ఫారెస్టు అధికారులు అనవసరంగా రైతులను ఇబ్బందులపాలు చేస్తున్నారు. ప్రభుత్వ రాతపూర్వక ఆదేశాలు లేకుండా భూమిపైకి ఫారెస్టు అధికారులు రాకూడదు. రిజర్వు ఫారెస్టులో అడవి 60 శాతం కూడా లేదు. అందులో అడవిని పెంచేందుకు అవకాశం ఉంది. వాటిని పెంచాలంటే నల్లమద్ది, బిల్లుడు, తునికి, టేకు, గుమ్మటేకు, అడవి మామిడి, ఉసిరి, మొక్కపు తదితర చెట్లు నాటాలి. కోతులు, అడవి పందులు, గుడ్డెలుగులు, కొండెంగులు అడవులలో ఆహారం దొరకక గ్రామాలకు తరలి వస్తున్నాయి' అని వారు లేఖలో తెలిపారు. ప్రభుత్వం అర్హులు పెట్టిన ధరఖాస్తులను పరిశీలించి వెంటనే హక్కు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అక్రమ కేసులు, నిర్భంధకాండకు స్వస్తి చెప్పి సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.