Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఇంటర్ విద్యాపరిరక్షణ సమితి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంట్రాక్టు అధ్యాపకుల విద్యార్హతలకు సంబంధించిన విశ్వవిద్యాలయాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తింపు ఉందా? లేదా? అనే పరిశీలనకు మాత్రమే ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించిందని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్) తెలిపింది. ఈ మేరకు టిప్స్ కన్వీనర్లు మాచర్ల రామకృష్ణగౌడ్, కొప్పిశెట్టి సురేష్, సమన్వయకర్త ఎం జంగయ్య గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ ప్రక్రియను విద్యాశాఖ వేగవంతం చేసిందని తెలిపారు. దాదాపు వంద రోజుల క్రితమే కాంట్రాక్టు అధ్యాపకుల సర్టిఫికెట్లను సంబంధిత ప్రిన్సిపాళ్లు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారుల వ్యక్తిగత పరిశీలన అనంతరం ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి పంపించారని గుర్తు చేశారు. కమిషనర్ కార్యాలయ అధికారుల నిర్లక్ష్యంతో ఆ జాబితాను ప్రభుత్వానికి పంపకుండా కాంట్రాక్టు అధ్యాపకులలో అనవసరంగా ఆందోళన కలిగించి మానసిక వేదనకు గురిచేసిందని విమర్శించారు. జాబితాను త్వరగా ప్రభుత్వానికి పంపాలంటూ ఆందోళన చేపట్టామని తెలిపారు. వారు చదివిన విశ్వవిద్యాలయాలకు యూజీసీ గుర్తింపు ఉందా? లేదా?అనే విషయాన్ని తెలపాలంటూ ఉన్నత విద్యా మండలికి ఇంటర్ విద్యా కమిషనర్ లేఖ రాశారని పేర్కొన్నారు. దీంతో త్రిసభ్య కమిటీని వేసి కాంట్రాక్టు అధ్యాపకులు చదివిన వర్సిటీలకు యూజీసీ గుర్తింపు ఉందా? లేదా? అనే అంశాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని ఉన్నత విద్యామండలి ఆదేశించిందని తెలిపారు. శనివారం చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు.