Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ కేటీఆర్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో సివరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) ప్రాజెక్టులకు రూ.8.654.54 కోట్లు ఖర్చవుతు ందని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. గురువారం ఢిల్లీలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి, ప్రాజెక్టు వ్యయంలో మూడో వంతు అమృత్-2 కింద రూ. 2,850 కోట్లు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ అర్బన్ అగ్లోమెరేషన్ (హెచ్ యుఏ)తో పాటు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో వంద శాతం సివరేజ్ ట్రీట్ మెంట్ చేపట్టేందుకు ప్రత్యామ్నాయ సివరేజ్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్టు ఆయన తెలిపారు. ఇందులో 62 సివరేజీ ప్లాంట్లున్నాయని చెప్పారు. ఈ ప్రతిపాదనలను భౌగోళికంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న, ప్రాధాన్యత క్రమంలో జీహెచ్ఎంసీ ఆవల, ఒఆర్ఆర్ పరిధిలోనివిగా విభజించినట్టు తెలిపారు. మొదటి దశ కింద రూ.3,866.21 కోట్లతో హైదరాబాద్ నగర పరిధిలో 1,250.50 ఎంఎల్డీ సామర్థ్యంతో 31 ఎస్టీపీలను, రూ.3,722.83 కోట్లతో 2,232 కిలోమీటర్ల విస్తీర్ణంలో సివరేజీ నెట్ వర్క్ ప్రాజెక్ట్, రెండో దశ కింద ఓఆర్ఆర్ వరకు రూ.1,095 కోట్లతో 340.50 ఎంఎల్డీ సామర్థ్యంతో 10 ఎస్టీపీలను ప్యాకేజీ-4 కింద నిర్మించనున్నట్టు మంత్రి వివరించారు. ఒకసారి ఈ పనులు పూర్తయితే వంద శాతం సివరేజీ సౌకర్యం హైదరాబాద్ అర్బన్ అగ్లోమెరేషన్ పరిధిలో ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌లో వ్యక్తిగత రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (పీఆర్టీఎస్)కు సహకరించాలని కేంద్రమంత్రిని కేటీఆర్ కోరారు. ఇప్పటికే నగరంలో 69 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ నెట్ వర్క్, 46 కిలోమీటర్ల మేర మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ (ఎంఎంటీఎస్) ఉన్నాయని తెలిపారు. దీనికి తోడు రాష్ట్ర అసెంబ్లీ నుంచి ప్యారడైజ్ మెట్రో స్టేషన్ వరకు 10 కిలోమీటర్ల మేర పీఆర్టీఎస్ కారిడార్ కోసం ప్రతిపాదనలు సమర్పిస్తున్నట్టు చెప్పారు. ఈ కారిడార్‌కు కన్సల్టెంట్‌గా ఉన్న ఇండియన్ పోర్ట్ రైల్ అండ్ రోప్ వే కార్పొరేషన్ లిమిటెడ్ (ఐపీఆర్‌ఆర్‌సీఎల్) దీనిపై డీపీఆర్ సిద్ధం చేసినట్టు కేటీఆర్ కేంద్ర మంత్రికి వివరించారు. దేశంలో పీఆర్టీ వ్యవస్థ ప్రమాణాలు, ప్రత్యేకతలు నిర్ణయించేందుకు కేంద్ర రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వశాఖ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. ఈ వ్యవస్థకు సంబంధించిన ప్రమాణాలు, ప్రత్యేకతలు, చట్ట నిబంధనలను త్వరగా ఖరారు చేసి తమకు అందించాలని కేటీఆర్ కోరారు.