Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సింగరేణి ప్రతినిధి
అనారోగ్యంతో సింగరేణి మెడికల్ బోర్డుకు హాజరయిన హెడ్ ఓవర్‌మెన్ బి.ప్రసాదరావును సర్ఫేస్ జనరల్ మజ్దూర్‌గా పనిచేయాలని ఆదేశించటానికి నిరసనగా గురువారం మైనింగ్ సిబ్బంది గనులపై నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. తక్షణమే మైనింగ్ సిబ్బందికి సర్ఫేస్‌లో అదే హోదాలో ఉపాధి కల్పించాలని సింగరేణి సీఎండీకి ఆయా గని అధికారుల ద్వారా వినతి పత్రాలను అందజేశారు. సింగరేణి వ్యాప్తంగా11 డివిజన్లలోని 26 భూగర్భ గనులు, 19 ఓపెన్ కాస్ట్ గనులు, ఎంవీటీసీ, రెస్క్యూ స్టేషన్లలో సిబ్బంది నిరసన తెలిపారు. రామగుండం డివిజన్ 1, 2, 3, భూపాలపల్లి, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు డివిజన్లలో మైనింగ్ సిబ్బంది నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా గోదావరిఖని ఓసీపీ-3 గనిపై జరిగిన కార్యక్రమంలో మైనింగ్ స్టాప్ అసోసియేషన్ నాయకులు మాదాసి రామమూర్తి మాట్లాడుతూ.. ఇటీవల ఆరు కార్మిక సంఘాలు యాజమాన్యంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం మైనింగ్ సిబ్బంది మెడికల్ అన్‌ఫిట్ సమస్యపై 60రోజుల్లో కమిటీ వేసి పరిష్కరిస్తానని ఇచ్చిన హామీపై ఎలాంటి పురోగతి లేదన్నారు. సూపర్వైజర్గా పని చేస్తున్న ప్రసాద్‌ను సర్ఫేస్ మజ్దూర్‌గా పనిచేయాలని ఆదేశించడం దుర్మార్గమైన చర్య అన్నారు. సింగరేణి మైనింగ్ స్టాఫ్ నాయకులు మాదాసి రామమూర్తి, నాగేల్లి సాంబయ్య, ఆరెల్లి పోచయ్య, మారేపల్లి బాబు, గోపతి సత్యనారాయణ, తోట రామచందర్, చల్ల రవీందర్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, నరెడ్ల సంపత్, మల్లికార్జున్, బొల్లేద్దుల ప్రభాకర్, అభిలాష్, బి.రవి, వల్లాల శంకర్, మల్లికార్జున్, ఎస్ శ్రీనివాస్, నర్సింగరావు పాల్గొన్నారు.