Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-చేగుంట
మావోయిస్టు అగ్రనేత దుబాష్ శంకర్ కుమారుడి ఇంట్లో వైజాగ్ ఎన్ఐఏ పోలీసులు గురువారం సోదాలు నిర్వహించారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని అద్దె ఇంట్లో నివాసముంటున్న శంకర్ కుమారుడు దేవేందర్ ఇంటికి ఎన్ఐఏ బృందానికి చెందిన ఏడుగురు పోలీసులు గురువారం ఉదయం 6 గంటలకు వచ్చి సోదాలు నిర్వహించారు. స్థానిక పోలీసులకు సమాచారం లేకుండా సోదాలు నిర్వహించడం గమనార్హం. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం చెట్ల నర్సంపల్లి గ్రామానికి చెందిన దుబాష్ శంకర్ చాలా ఏండ్ల కిందటే మావోయిస్టు దళంలో చేరి అగ్రనేతగా ఎదిగారు. అతని మీద ఎన్నో ప్రభుత్వ ఆంక్షలు, కేసులు ఉండగా ఇటీవలే పోలీసులు పట్టుకొని భువనేశ్వరి జైలుకు తరలించారు.
ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. కాగా, గతేడాది నవంబర్లో పోలీసులు శంకర్ కుమారుడు నివాసముంటున్న అద్దె ఇంటికి వచ్చి తనిఖీలు నిర్వహించారు. సుమారు 12 గంటల పాటు తనిఖీలు నిర్వహించి అతని ఇంటి నుంచి సెల్ఫోన్లు తీసుకెళ్లారు. తిరిగి గురువారం మరోమారు తనిఖీల పేరిట పోలీసులు రావడంతో శంకర్ కుమారుడు దేవేందర్ ఆందోళన చెందాడు. దేవేందర్ భార్య స్వప్న గర్భిణి. తల్లిని కోల్పోయి, తండ్రి ప్రేమకు దూరమై చిన్న కంపెనీలో పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నానని, ఇలా సోదాల పేరుతో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని దేవేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.