Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెండ్లికి కులాల అడ్డుగోడలు
- అంగీకరించని పెద్దలు
- కడిచర్ల, ఏబ్బనూర్ గ్రామాల్లో విషాదం
నవతెలంగాణ-నవాబ్‌పేట, వికారాబాద్ ప్రతినిధి
వేర్వేరు సామాజిక తరగతులు కావడం.. పెండ్లికి కులాలు అడ్డుగోడలుగా నిలవడంతో ప్రేమికులిద్దరూ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మొరంగపల్లి- సదాశివపేట రోడ్డు సమీపంలోని రైల్వేట్రాక్‌పై గురువారం జరిగింది. వికారాబాద్ డివిజినల్ రైల్వే కానిస్టేబుల్ నర్సింగ్ రాథోడ్, బాధిత కుటుంబాల వివరాల ప్రకారం.. కడిచర్ల గ్రామానికి చెందిన పల్లె పవన్‌కుమార్(18)ది ముదిరాజ్‌ల కుటుంబం. ఏబ్బనూర్ గ్రామం ఎస్సీ సామాజిక తరగతికి చెందిన బేగరి సత్తయ్య కూతురు అభినయ(17) ఇంటర్ రెండో సంవత్సరం కొంపల్లి గురుకుల పాఠశాలలో చదువుతున్నది. పవన్‌కుమార్ ఇంటివద్దనే ఉంటూ తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సహాయంగా ఉంటున్నాడు. కాగా, పవన్, అభినయ్య వికారాబాద్‌లోని ఒక పాఠశాలలో చదివినప్పుడు సీనియర్, జూనియర్. పవన్ డిగ్రీ చదువు మధ్యలోనే ఆపేశాడు. కళాశాలకు సెలవులు కావడంతో అభినయ ఊర్లోనే ఉంది. వీరిద్దరూ ప్రేమించుకున్నారు. విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో తల్లిదండ్రులు మందలించారు. ఇద్దరికీ పెండ్లి వయస్సు రాలేదనీ, కులాంతర వివాహం చేయడం కుదరదనీ చెప్పారు. దాంతో ఇక తాము కలిసి జీవించలేమని ప్రేమికులు భావించారు. అభినయ, పవన్‌కుమార్ ఇండ్ల నుంచి బైక్‌పై వెళ్లిపోయి కడిచర్ల గ్రామానికి సమీపంలో హైదరాబాద్- ఔరంగాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. రెండు మృతదేహాల దగ్గర లభించిన ఆధారాలతో తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. మృతదేహాలను వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. అభినయ తల్లి సుమిత్ర, పవన్ తండ్రి యాదయ్య ఫిర్యాదుల మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.