Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలలకు మనోవికాసాన్ని కల్పిస్తున్న ప్రతిష్టాత్మక సంస్థకు పలువురి ప్రశంసలు
నవ తెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చిన్న వయస్సులోనే బాల బాలికలకు మనో వికా సాన్నికలిగిస్తే... వారు పెరిగి పెద్ద వారయ్యాక మంచి పౌరులుగా ఎదుగుతారని భావించిన భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆలోచనల నుంచి పుట్టిందే హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో ఉన్న జవహర్ బాల భవన్. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన తనయ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి సంస్థలను నెలకొల్పారు. ఆమెకు ఈ ప్రక్రియలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూడా చేదోడు వాదోడుగా నిలిచారు. ఇంత మంది పెద్దలు, ప్రముఖుల మేధస్సులోంచి పుట్టిన హైదరాబాద్ బాల భవన్‌కు నేటితో 57 ఏండ్లు నిండాయి. అది ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకూ వేలాది మంది బాల బాలికలకు లలిత సంగీతం, చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, గానం, జానపద గీతాలతోపాటు ఇతర అనేక కళల్లో తర్ఫీదునిచ్చారు. వారిలో అనేక మంది వివిధ రంగాల్లో నిష్టాతులుగా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అనేక పోటీల్లో ఇక్కడి బాలలు అవార్డులు, రివార్డులు సంపాదించారు. మరోవైపు హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ (హెడ్ ఆఫీసు.. బాలభవన్)తో పాటు రాష్ట్రంలోని అనేక జిల్లాలు, ముఖ్య పట్టణాల్లోని బాల భవన్లు, బాల కేంద్రాలు నిత్యం పిల్లలకు శిక్షణనిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాయి. బాల భవన్‌కు 57 ఏండ్లు నిండిన సందర్భంగా డైరెక్టర్ ఉషారాణి... సంస్థలోని శిక్షకులకు, సిబ్బందికి, బాల భవన్లు, బాల కేంద్రాల్లోని ఉద్యోగులు, సిబ్బందికి ఒక ప్రకటనలో శుభాకాంక్షలు, అభినం దనలు తెలిపారు. సంస్థ పురోభివృద్ధికి మరింతగా సహకరించాలని ఆమె కోరారు. మరోవైపు సూర్యాపేటలోని బాల భవన్ అభివృద్ధికి సహకరిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డికి, జిల్లా కలెక్లర్కు, విద్యాశాఖాధికారికి, డైరెక్టర్ ఉషారాణికి, స్థానిక ప్రజా ప్రతినిధులకు అక్కడి సూపరింటెండెంట్ బండి రాధా కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. తమ సంస్థ సేవలను వినియోగించుకుంటున్న బాల బాలికలకు, వారి తల్లిదండ్రులకు, తమ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్న మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులకు ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు.