Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయం చేయాలని తోటి ఉద్యోగుల నిరసన
- ఆషా వర్కర్లు, పోలీసుల మధ్య తోపులాట.. పరిస్థితి ఉద్రిక్తం
- సీఐటీయూ నేతలతో పాటు పలువురి అరెస్టు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉన్నతాధికారుల టార్గెట్లు, వేధింపులు తాళలేక అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లో ఆషావర్కర్ సుజాత(31) గురువారం మరణించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని మూసారాంబాగ్‌లోని అరోరా కాలేజీ సమీపంలో రోడ్డుపై బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా ఎమ్మార్పీఎస్ నేతలు కూడా ఆందోళనకు దిగారు. గంటన్నరపాటు ఆందోళన చేసినా ఉన్నతాధికారులు అక్కడకు రాకపోవడంతో ఆశావర్కర్లు ఆవేశానికిలోనై ముందుకెళ్లేందుకు యత్నించారు. 'పోలీసు అన్నల్లారా, అక్కల్లారా! మీ కుటుంబంలో ఎవరికైనా ఇలా జరిగితే ఇట్లాగే చేస్తారా? ఆశా వర్కర్ చనిపోతే ఉన్నతాధికారులకు పట్టదా? గంటన్నర నుంచి శవంతో ఆందోళన చేస్తుంటే ఉన్నతాధికారులు రారా? వాళ్ల కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే ఇలాగే చేస్తారా? ఇదేం పద్ధతి? న్యాయం అడిగితే తోసేస్తారా? అరెస్టు చేస్తారా? ఇదెక్కడి అన్యాయం?' అంటూ ఆశా వర్కర్లు పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించారు. అదే సమయంలో అక్కడ స్థానిక, స్పెషల్ బ్రాంచ్ పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు. ఆశా వర్కర్లను చుట్టేశారు. 'మృతదేహాంపై ఎర్రటెండ పడుతున్నది. చెట్టు నీడన పెడతాం' అంటూ శవాన్ని అక్కడ నుంచి ముందుకు కదిలించే యత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మహిళా పోలీసులకు, ఆశా వర్కర్లకు మధ్య తోపులాట జరిగింది. ప్రత్యేక పోలీసులు తాళ్లతో ఆశాలను చుట్టేసి ముందుకెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే కాస్త ఉద్రిక్తత నెలకొంది. మహిళలని కూడా చూడకుండా పోలీసులు ఈడ్చిపడేశారు. కాళ్లు, చేతులు పట్టుకుని ఎత్తుకెళ్లారు. బలవంతంగా బస్సు ఎక్కించే క్రమంలో కొందరు ఆశా వర్కర్లకు, మహిళా పోలీసుల చేతులకు గాయాలయ్యాయి. ఇలా పదుల సంఖ్యలో ఆశా వర్కర్లను అరెస్టు చేశారు. ఈ ఆందోళనకు నేతృత్వం వహించిన తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి.జయలక్ష్మి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకటేశ్, జిల్లా కార్యదర్శి ఎం.శ్రవణ్, శ్రామిక మహిళ కన్వీనర్ ఎమ్.మీనా, ఎమ్మార్పీఎస్ నాయకులు కిరణ్, ఉప్పలయ్యలను కూడా అరెస్టు చేశారు. అంబర్‌పేట, ఓయూ, తదితర పోలీస్స్టేషన్లకు తరలించారు.
కంట తడి పెట్టించిన చిన్నారుల రోదన
సుజాత మలక్‌పేట పరిధిలోని శాలివాహననగర్ పీహెచ్సీ పరిధిలో ఆశావర్కర్‌గా పనిచేస్తున్నది. ఆమె భర్త మల్లేశ్ కరెంట్ ఆఫీసులో హెల్పర్‌గా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. వారి ముగ్గురు పిల్లలు అక్షయ(13), శ్రావ్య(11), సిద్దూ(8) చిన్నవారే. 'సుజాత పనిచేసే ప్రాంతం హెల్త్ సర్వే విషయంలో కాస్త వెనుకబడింది. దీంతో ఆమెపై ఉన్నతాధికారుల వేధింపులు ఎక్కువయ్యాయి. పది రోజుల కిందనే మెడనరాలు గుంజుతున్నాయి..చేతులు లాగుతున్నాయని ఇంట్లో చెప్పటంతో ఆమెను ఆస్పత్రిలో చూపెట్టాం. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నదని తెలిసినప్పటికీ ఫోన్లమీద ఫోన్లు వస్తనే ఉన్నయి. అధికారుల ఫోన్లను భరించలేక తప్పనిసరి పరిస్థితుల్లో విధులకు హాజరైంది. మూడు రోజుల కిందటి వరకూ కూడా డ్యూటీ చేసింది. గుండె దగ్గర నొప్పి వస్తుందని చెప్పడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఆమెకు గుండెనొప్పితో బాధపడుతున్నది..మావల్ల కాదు అంటే యశోదకు ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఆమె టెన్షన్ పెట్టుకోవడం వల్లనే ఇలాగైంది. వైద్యానికి కూడా సహకరించట్లేదని వైద్యులు చెప్పారు. రెండు రోజుల తర్వాత చనిపోయింది' అని కుటుంబ సభ్యులు రోదిస్తూ చెప్పారు. సుజాత మృతదేహం వద్ద ముగ్గురు పిల్లలు రోదించడం, డీఎంహెచ్ఓ వద్ద దీనంగా అందరి మొహాలు చూస్తూ నిలబడటం అందర్నీ కలచివేసింది. సుజాత నుంచి వైద్య సేవలు పొందిన శాలివాహన నగర్ పీహెచ్సీ పరిధిలోని చాలా మంది మహిళలు ఆమెను కడసారి చూసేందుకు వచ్చారు. గురువారం సాయంత్రం అంత్యక్రియలు పూర్తయ్యాయి.
కుటుంబానికి న్యాయంపై దాటవేసిన జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి వెంకట్
అరెస్టుల తర్వాత కాసేపటికి హైదరాబాద్ డీఎమ్హెచ్ఓ వెంకట్ అక్కడకు చేరుకున్నారు. కుటుంబానికి న్యాయం చేసే విషయంపై అక్కడున్న ఆశా కార్యకర్తలు అడిగారు. దీంతో ఆయన మాట్లాడుతూ..'ఆమె అనారోగ్యంతో చనిపోయింది. యశోద ఆస్పత్రిలో బిల్లు కూడా తగ్గేలా చూశాం. సుజాత చనిపోయిందనే విషయం తెలియగానే సొంతంగా నా చేతుల నుంచి రూ.20 వేల వరకు ఇచ్చా. నష్టపరిహారం విషయంపై నేనేం మాట్లాడలేను. మోమోరండం ఇస్తే ఉన్నతాధికారులకు పంపిస్తా' అన్నారు. అదే సమయంలో అక్కడున్న ఆశాలు మాట్లాడుతూ.. 'ఆమె అనారోగ్యానికి ఎలా గురైంది? టార్గెట్ రీచ్ కావడం లేదని ఉన్నతాధికారులు వేధించింది వాస్తవం కాదా? టెన్షన్ తట్టుకోలేకనే ఆమె మెడనరాలు, చేతులు బాగా లాగి అనారోగ్యానికి గురైంది...వేధింపులు కాదనటం సరిగాదు. అనారోగ్యంతో ఉన్న ఆమెను డ్యూటీ చేసేలా వేధించింది వాస్తవం కాదా? మాకేమైనా వేతనాలిస్తున్నారా? టార్గెట్లేంది? పనిచేయాలా? చావాలా? మమ్ముల్ని జూమ్ మీటింగ్‌లలో ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు?' అంటూ ప్రశ్నల వర్షం కురిపించడంతో ఒకింత అసహనానికి గురైన వెంకట్ 'నేను నా విధులు నేను నిర్వర్తిస్తున్నా. మీ ఇష్టం ఉంటే చేయండి. లేకపోతే లేదు' అంటూ అనడంతో ఆశాలు, సీఐటీయూ నేతలు ఆగ్రహానికి గురయ్యారు. పోలీసులు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.