Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిమ్స్‌లో పీడియాట్రిక్ హార్ట్ సర్జరీ యూనిట్ (చిన్న పిల్లల హృద్రోగ శస్త్రచికిత్సల విభాగం) అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు 200 ఐసీయూ పడకలను గురువారం రాష్ట్ర వైద్యా రోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రారంభించారు. నిమ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియోథొరాసిక్ సర్జరీ, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్, సువెన్ లైఫ్ సైన్సెస్‌తో కలిసి సంయుక్తంగా దీన్ని ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా మంత్రి సువెన్ ఫార్మా సుటికల్స్ సీఎండీ వెంకట్ జాస్తిని, రోటరి క్లబ్ ఆఫ్ జూబ్లిహిల్స్ అధ్యక్షులు పి సురేష్ గుప్తా, కార్యదర్శి కళ్యాణ్‌ను అభినందించారు. ఈ ప్రాజెక్టును దాదాపు రూ.నాలుగు కోట్లతో అనుకున్న సమయంలో పూర్తి చేశారని ఆయన తెలిపారు. సకల సదుపాయాలతో కూడిన 6 పడకల అత్యాధునిక మాడ్యులర్ కార్డియోథోరాసిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇది. హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ సదుపాయానికి అనువైన క్లాస్-1 ఎయిర్ కండీషన్డ్ ఐసోలేషన్ క్లీన్ రూం. హార్ట్ లంగ్ మిషన్, నైట్రిక్ ఆక్సైడ్ సరఫరా యంత్రం, బ్రాంకోస్కోప్, ఫొటోథెరపీ యూనిట్లు ఇందులో ఉన్నాయి. పుట్టుకతో గుండె జబ్బులు ఉన్న పిల్లలకు, ఇతర పేద రోగులకు ఈ యూనిట్ ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరనుంది...అని మంత్రి వివరిం చారు. నిమ్స్‌కు ప్రతి ఏడాది రూ.200 కోట్లు గ్రాంట్లు ఇస్తున్నామనీ, గత ఆరు నెలల్లో రూ.186 కోట్ల పరికరాలను సమకూర్చామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఐసీయూ పడకలు 166 నుంచి 200కు, ఐదు ఎక్మో మిషన్లు అందుబాటు లోకి వచ్చాయన్నారు. వెంటిలేటర్లను 68 నుంచి 125కు (ఇందులో 25 అడ్వాన్స్ లైఫ్ వెంటిలేటర్లు) మంజూరు చేశామని తెలిపారు. ఐదు సీఆర్ఆర్ టీ మెషిన్లను ప్రారంభించుకున్నామని చెప్పారు.
త్వరలో....
రూ.50 కోట్లతో 200 పడకల మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ (ఎంసీహెచ్) భవనాన్ని, రెండు వేల పడకలతో మరో భవనాన్ని ఎర్రమంజిల్ కాలనీ వద్ద ఉన్న 32 ఎకరాల్లో నిర్మించేందుకు త్వరలోనే పాలనాపరమైన అనుమతులు ఇవ్వనున్నట్టు తెలిపారు. 16 పీజీ సీట్లు పెంచడానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)కి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు.
మమ్మల్ని ఆదుకోండి
- మంత్రికి డయాలసిస్ రోగులు మూడోసారి వినతి
తామెదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డయాలసిస్ రోగులు మంత్రి హరీశ్‌రావుకు మూడోసారి వినతిపత్రం సమర్పించారు. నాలుగేండ్ల క్రితం హరీశ్ రావుకు మొదటి సారి, ఆయన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక గత డిసెంబర్లో, తాజాగా గురువారం నిమ్స్ సందర్శన సందర్భంగా మూడోసారి వారు వినతిపత్రం సమర్పించారు. తమను ఆదుకోవాలని తెలంగాణ కిడ్నీ పేషెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మంత్రిని కోరింది. ఆ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సీహెచ్. మోహన్ నేతృత్వంలో ప్రతినిధులు మంత్రిని కలుసుకున్నారు. డయాలసిస్ చేయించుకుంటున్న తమకు బ్లడ్, ఐరన్, కాల్షియం తగ్గిపోతుండటంతో మందుల కొనుగోలుకు అప్పులు చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు కనీసం రూ.20 వేల నుంచి 25 వేల వరకు ఖర్చు అవుతుందనీ, ఇంటి అద్దెలు కట్టలేక ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఇస్తున్నట్టుగా కిడ్నీ బాధితులకు నెలకు రూ.10 వేల పెన్షన్ ఇప్పించాలనీ, జీవిత బీమా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.