Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓయూ జేఏసీ రౌండ్‌టేబుల్‌లో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్ పథకాన్ని రద్దుచేసే వరకూ పోరాడతామని ఓయూ జేఏసీ రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు పిలుపునిచ్చారు. భారత రక్షణ రంగాన్ని ప్రయివేట్ పరం చేస్తున్న అగ్నిపథ్ పథకం, కాంట్రాక్ట్ విధానానికి వ్యతిరేకంగా గురువారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఓయూ జేఏసీ చైర్మెన్ మందాల భాస్కర్, అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ అగ్నిపథ్ పథకం ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు వ్యతిరేకమని విమర్శించారు. రిజర్వేషన్లు లేకుండా నాలుగేండ్ల కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించి యువకుల జీవితాలను నాశనం చేసే పథకమని అన్నారు. కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్, బెల్లయ్యనాయక్, రవి నాయక్ మాట్లాడుతూ అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలన్న ఉద్యమంలో అమరుడైన రాకేష్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తేయాలని కోరారు. దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలనూ కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్న మోడీ ప్రభుత్వం త్రివిధ దళాలనూ ప్రయివేటుపరం చేయడం సిగ్గు చేటన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ సెర్చ్ కమిటీ కన్వీనర్ ఇందిరా శోభన్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రద్దు చేయడం కోసమే ఆరెస్సెస్ అగ్నిపథ్ పథకాన్ని తెచ్చేందుకు కుట్ర చేసిందని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాజారామ్ యాదవ్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం హిందూ-ముస్లిం, ఎస్టీ ,ఎస్టీలను విభజిస్తూ కాలం గడుపుతుం దన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వ్యవస్థాపకులు అశోక్ యాదవ్, తెలంగాణ విద్యార్థి సమాఖ్య అధ్యక్షులు పూదరి హరీష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నేత నరేష్ జాదవ్, ఓయూ జేఏసీ ప్రధాన కార్యదర్శి రవీందర్ నాయక్, బీసీ నేత చిరంజీవి బెస్త తదితరులు పాల్గొన్నారు.
రౌండ్ టేబుల్ సమావేశ తీర్మానాలు
- అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి
- సికింద్రాబాద్ అల్లర్లలో పేద విద్యార్థు లపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తేయాలి.
- పోలీసు కాల్పుల్లో మరణించిన రాకేష్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.
- సికింద్రాబాద్ అల్లర్లలో గాయపడిన ప్రతి విద్యార్థికి వైద్య సహాయం కోసం రూ.30 లక్షలు అందించాలి.
- రాష్ట్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి.
- దేశంలోని అన్ని వర్శిటీల విద్యార్థులతో త్వరలో ఢిల్లీ కేంద్రంగా భారీ ప్రదర్శన.
- విద్యార్థులపై పెట్టిన కేసులను తొలగించే వరకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండి బెయిల్ ఇప్పించి విడుదల చేయాలి.