Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయం చేయాలంటూ పాఠశాల ముందు ధర్నా
- హాస్టల్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన ప్రజాసంఘాల నేతలు
- అరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ-బోడుప్పల్
రెండ్రోజుల కిందట పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని.. రాత్రి భోజనం చేశాక చదువుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలి మృతిచెందింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో (ఫైన్ ఆర్ట్స్ జంగంమేట్) బుధవారం రాత్రి జరిగింది. పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు చనిపోయిందంటూ తల్లిదండ్రులు, బంధువులు ధర్నా చేశారు. ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు మద్దతుగా నిలిచారు. దీంతో పోలీసులు ఆందోళన కారులను అరెస్టు చేసి పోలీసు స్టేషనుకు తరలించారు. వివరాలిలా ఉన్నాయి..
అచ్చంపేట రంగాపూర్ తండాకు చెందిన కె.సుభాష్ నాయక్- లలితా దంపతుల కుమార్తె కె.అనిత గిరిజన పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. సోమవారం నుంచి బడులు ప్రారంభం కావడంతో రెండ్రోజుల కిందటే తల్లిదండ్రులు అనితను హాస్టల్లో చేర్పించి వెళ్లారు. బుధవారం రాత్రి అన్నం తిన్న తర్వాత తోటి విద్యార్థినులతో కలిసి చదువుకుంటుండగా ఒక్కసారిగా కూలిపోయింది. దాంతో వెంటనే విద్యార్థినులు ఉపాధ్యాయులకు చెప్పగా.. స్థానికంగా ఉన్న ప్రయివేటు హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే విద్యార్థిని మృతిచెందినట్టు వైద్యులు నిర్దారించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే, పూర్తి ఆరోగ్యంతో ఉన్న అనిత అకస్మాత్తుగా ఎలా చనిపోయిందని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. తమకు అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. 400 మంది విద్యార్థులు ఉంటున్న ఈ హాస్టల్లో ఒక్క నర్సింగ్ స్టాఫ్ కూడా లేకపోవడం వల్లే విద్యార్థినికి తక్షణం వైద్య సహాయం అందక ప్రాణం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
న్యాయం చేయాలంటూ ధర్నా..
గిరిజన విద్యార్థిని మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల ఎదుట ధర్నా చేశారు. వారికి ఎస్ఎఫ్ఐ, గిరిజన సంఘం, సీపీఐ(ఎం), ఏఐఎస్ఎఫ్, కాంగ్రెస్, బీఎస్పీ, బీజేపీ, అఖిల భారత గిరిజన సంఘం, గిరిజన విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు ప్రకటించి బైటాయించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థిని కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, డబుల్ బెడ్రూం ఇల్లు, మూడెకరాల స్థలం, ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన నిర్వాహకులను సస్పెండ్ చేయాలని కోరారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు, హాస్టల్స్‌లో కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న బాలిక ప్రాణం కోల్పోయిందన్నారు. పాఠశాలకు విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, స్థానిక మంత్రి మల్లారెడ్డి, గురుకుల పాఠశాలల సెక్రటరీ రోనాల్డ్ రాస్ వచ్చి కుటుంబంతో మాట్లాడాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
కుటుంబానికి న్యాయం చేస్తాం
కీసర ఆర్డీవో నాయక్, మల్కాజిగిరి ఏసీపీ శ్యాంప్రసాద్ రావు ఘటనా స్థలానికి వచ్చి విద్యార్థిని కుటుంబీకులతో మాట్లాడారు. ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకుల సమక్షంలో చర్చలు జరిపారు. తక్షణ సాయం కింద రూ.50 వేలు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, ప్రభుత్వ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగం ఇవ్వడం తమ చేతిలో ఉన్నట్టు కలెక్టర్ హామీ ఇచ్చారు. మిగతా అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామన్నారు. అందుకు నాయకులు ఒప్పుకోకుండా హాస్టల్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అరెస్టు చేసి మేడిపల్లి పోలీస్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మానాయక్, సీపీఐ(ఎం) నాయకులు ఎన్.సృజన, కాంగ్రెస్ మేడ్చల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ తోటకూర వజ్రేష్ యాదవ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సంతోష్ రాథోడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుట్టా లక్ష్మణ్, జిల్లా కార్యదర్శి ఎండీ అన్వర్, పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, మహిళ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీలత బధ్రు నాయక్, గిరిజన సంఘం ప్రతినిధులు, బీజేపీ అధ్యక్షుడు నెమలికొండ అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థిని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, విద్యార్థిని కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం కార్యదర్శి పగడాల లక్ష్మయ్య ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
మా తప్పేం లేదు..
గిరిజన సంక్షేమ హాస్టల్లో విద్యార్థిని మృతి వెనుక తమ తప్పేమీ లేదని ఇన్చార్జి ప్రిన్సిపాల్ మాలిని తెలిపారు. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో అందరితోపాటే ఆ విద్యార్థిని కూడా భోజనం చేసినట్టు చెప్పారు. అనంతరం స్టడీ అవర్‌లో భాగంగా చదువుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా పడిపోయిందన్నారు. తాము వెంటనే ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయిందని, గుండెపోటు కావచ్చని చెప్పారని అన్నారు.