Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ కార్యాలయం కోసం ఖరీదైన భూమిని చౌకగా ఇచ్చిన ప్రభుత్వం
- పిల్‌ను విచారించిన హైకోర్టు
- సీఎస్, ఇతర అధికారులకు నోటీసులు
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులిచ్చింది. హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లో పార్టీ కార్యాలయ నిమిత్తం 4,935 గజాల స్థలాన్ని ప్రభుత్వం సబ్సిడీ ధరకు కేటాయించడాన్ని సవాల్ చేసిన కేసులో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గజం రూ.100 చొప్పున కేటాయించడాన్ని సవాల్ చేస్తూ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి, ఆలిండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.మహేశ్వర్ రాజ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని గురువారం హైకోర్టు విచారించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలకు గజం రూ.100 చొప్పున గరిష్టంగా ఎకరం భూమి కేటాయించేందుకు వీలుగా 2018లో జీవో 47 జారీ చేయడాన్ని పిటిషనర్ సవాల్ చేశారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలితో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ కమిషనర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష (కేసీఆర్), ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి (శ్రీనివాస్‌రెడ్డి)లకు నోటీసులు జారీ చేసింది. తమ వాదనలతో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు ఇచ్చింది. మార్కెట్ విలువ ప్రకారం బంజారాహిల్స్‌లో కేటాయించిన భూమి విలువ రూ.110 కోట్ల వరకు ఉంటుందని పిటిషనర్ తరుపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. హైదరాబాద్ జిల్లా కార్యాలయం కోసం 4,935 గజాలను ఇచ్చారనీ, ఇది టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉందని ఆయన తెలిపారు. జిల్లా కార్యాలయాన్ని అదే భవనంలో ఏర్పాటు చేసుకునేందుకు వీలున్నా స్థలాన్ని కేటాయించారని పేర్కొన్నారు. ఒక టీవీ ఛానల్‌ను కూడా టీఆర్ఎస్ నిర్వహిస్తున్నదని చెప్పారు. కేటాయించిన భూమికి గజం విలువ కేవలం వంద రూపాయలేనంటూ ప్రభుత్వం పేర్కొంటున్నదని వివరించారు. వాస్తవానికి అక్కడ గజం విలువ రూ.2.5 లక్షల వరకు ఉందన్నారు. దీని ప్రకారం హైదరాబాద్ బంజారాహిల్స్ కార్యాలయానికి ఇచ్చిన జాగా ఖరీదు రూ.110 కోట్లు ఉంటుందన్నారు. వాస్తవానికి 2005లో నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీఆర్ఎస్ ఆఫీసుకు ఎకరా భూమి ఇచ్చిందనీ, దానికి 800 గజాల దూరంలో ఇప్పుడు కేటాయించిన స్థలం ఉందన్నారు. ఇప్పుడున్న ఆఫీసులో పార్టీతోపాటు ఒక టీవీ చానల్ ఆఫీసు కూడా ఉందన్నారు. ఇలా ఉండటం చట్ట వ్యతిరేకమన్నారు. అక్కడే జిల్లా పార్టీ ఆఫీసు కూడా నిర్వహించవచ్చని వివరించారు. రెండు పడక గదుల ఇళ్లను కట్టి పేదలకు ఇచ్చేందుకు స్థలాలు లేవని చెబుతున్న ప్రభుత్వం అధికార టీఆర్ఎస్ ఆఫీసుకు మాత్రం ఖరీదైన భూమి ఇచ్చేసిందన్నారు. సీఎం కేసీఆర్ ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గి ఆ పార్టీ ఆఫీసుకు భూమి ఇచ్చిందన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు జిల్లా కేంద్రాల్లో గజానికి రూ.100 చొప్పున ఎకరం స్థలం కేటాయించేలా 2018లో ప్రభుత్వం జీవో 47ను జారీ చేసిందన్నారు. దీనిని అడ్డం పెట్టుకుని హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని 4,935 గజాలను అంటే ఎకరం వరకు భూమిని గజం వంద రూపాయలకు ఇచ్చేస్తూ 2022, మే 11న సర్కారు నిర్ణయం తీసుకుందన్నారు. బంజారాహిల్స్‌లో టీఆర్ఎస్ జిల్లా ఆఫీస్ కోసం గజం రూ.100 చొప్పున 4,935 గజాలను చౌకగా కేటాయించిందని చెప్పారు. కేవలం రూ.4,93,500లకే వంద కోట్లకు పైగా విలువైన భూమిని భూమిని కేటాయించిందన్నారు. వాద ప్రతివాదనల తర్వాత హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.