Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదోళ్ల కోసం పోరాటం చేసిండు : పీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి
- కాంగ్రెస్లో చేరిన కార్పొరేటర్ విజయారెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
'పీజేఆర్ అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటేనే పీజేఆర్. పేదోళ్ల కోసం పోరాటం చేసిండు. సీల్పీ నేతగా ఎదిగిండు' అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి అన్నారు. ఖైరతాబాద్ కార్పొరేటర్, పీజేఆర్ కూతురు విజయారెడ్డి గురువారం హైదరాబాద్లోని గాంధీ భవన్లో రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ఇతర ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన వాళ్లకు పీజేఆర్ అండగా ఉన్నారని, పీజేఆర్ పుణ్యమా అని లక్షలాది మంది ఇండ్లు కట్టుకున్నారని గుర్తుచేశారు. సొంత పార్టీలోనే ప్రజల కోసం గళం విప్పిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కృష్ణా జలాల కోసం పోరాటం చేశారని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కూడా పీజేఆర్ వల్లే వచ్చిందని చెప్పారు. నీళ్ల కోసం, ఇండ్ల కోసం అసెంబ్లీలో కూడా పీజేఆర్ పోరాటం చేశారని గుర్తు చేశారు. పరిశ్రమల్లో కార్మికునికి అన్యాయం జరిగితే ముందుండి పోరాటం చేసేవారన్నారు. ఇప్పుడు పీజేఆర్ ఉంటే.. ఫార్మా భూసేకరణకు అడ్డుగా పోరాటం చేసేవారన్నారు. పీజేఆర్ కుటుంబానికి కాంగ్రెస్ నేతలకు విడదీయరాని బంధం ఉందన్నారు. పీజేఆర్ పెంచి పోషించిన వాళ్లు చాలామంది నాయకులయ్యారని, ఆ కుటుంబానికి మనం అండగా ఉండాలన్నారు. విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున, ప్రజలకోసం పోరాటం చేస్తారని చెప్పారు. ఎంపీ కొమటి రెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. మేడిపల్లి ఫార్మా సిటీ కట్ట నియ్యకుండా కాంగ్రెస్ పోరాటం చేస్తదన్నారు. త్వరలోనే అక్కడ తాను, రేవంత్ పర్యటిస్తామని చెప్పారు. ఒక్క ఎకరా కూడా ఫార్మాకు పోనివ్వకుండా చూస్తా మన్నారు.
కార్పొరేటర్ విజయారెడ్డి మాట్లాడుతూ.. ఖైరతాబాద్ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. పీజేఆర్ బిడ్డగా తనను ఆశీర్వాదిస్తూ ముందుకు నడిపిన వారికీ ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్లో చేరడం తొందరపాటు నిర్ణయం కాదని, ప్రజల కోసమేనని చెప్పారు.