Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 యూనివర్సిటీల్లో బోధన, బోధనేతర పోస్టులు భర్తీ
- చైర్మెన్‌గా ఉన్నత విద్యామండలి చైర్మెన్
- ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కామన్ బోర్డును ఏర్పాటు చేసింది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మినహా మిగిలిన 15 వర్సిటీల పరిధిలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ కామన్ బోర్డు చైర్మెన్‌గా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ వ్యవహరిస్తారని ప్రకటించింది. కళాశాల విద్యాశాఖ కమిషనర్ మెంబర్ కన్వీనర్‌గా, ఉన్నత విద్యాశాఖ, ఆర్థిక శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారని తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ గురువారం జీవో నెంబర్ 16ను విడుదల చేశారు. అవసరమైతే నిపుణులను సభ్యులుగా నియమించేందుకు కామన్ బోర్డుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 15 విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగ నియామకాలను కామన్ బోర్డు ద్వారా చేపట్టనున్నారు. విధివిధానాలు, నియామక ప్రక్రియ ఎలా చేపట్టాలనే దానిపై త్వరలో స్పష్టత రానుంది. వర్సిటీల్లోని 3,500 పోస్టుల భర్తీకి కామన్ బోర్డు నియామక ప్రక్రియ ప్రారంభించనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అనుమతిచ్చింది. నియామక ప్రక్రియ కోసం వేచిచూస్తున్నారు.
త్వరలో నిబంధనలు జారీ...
ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, శాతవాహన, మహాత్మగాంధీ, పొట్టి శ్రీరాములు తెలుగు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జేఎన్టీయూ హైదరాబాద్, జేఎన్ఏఎఫ్ఏయూ, ఆర్జీయూకేటీ, వ్యవసాయ, ఉద్యాన, అటవీ, మహిళా విశ్వవిద్యాలయాల్లో నియామకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కామన్ బోర్డును ఏర్పాటు చేసింది. వాటిలో 3,500 బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని ఏప్రిల్ 12న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల పరిధిలో 1,551 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. అందులో మొదటి విడతలో 1,061 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే అప్పటి నుంచి వాటి భర్తీ కోసం నోటిఫికేషన్ రాకపోవడం గమనార్హం. గతంలో విశ్వవిద్యాలయాలే వేర్వేరుగా ఉద్యోగ ప్రకటనలు జారీ చేసి నినయామకాలు చేపట్టే విధానం అమల్లో ఉన్నది. దానివల్ల ఒకే అభ్యర్థి వేర్వేరు విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాల్లో నియామకమైనపుడు మళ్లీ ఖాళీలు ఏర్పడుతున్నాయన్న అభిప్రాయాలున్నాయి. దానికి తోడు ఒక్కో వర్సిటీ ఒక్కో విధానం అమలు చేయడం వల్ల గందరగోళం తలెత్తుతుందన్న సందేహాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వర్సిటీల్లో నియామకాల కోసం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫారసులను పరిశీలించి క్యాబినెట్ కామన్ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మంగళవారం అందుకు సంబంధించిన దస్త్రంపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. దానికి అనుగుణంగా గురువారం బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవోనెంబర్ 16ను విడుదల చేసింది. బోర్డు నిర్వహణ ఖర్చులను ఉన్నత విద్యామండలి ఆయా విశ్వవిద్యాలయాల నుంచి సేకరించి కేటాయిస్తుంది. బోర్డు విధివిధానాలు, నియామక ప్రక్రియ నిబంధనలను త్వరలో ఖరారు చేసి ప్రకటించనుంది. విశ్వవిద్యాలయాల చట్టాల సవరణకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో ప్రత్యేకంగా విడుదల చేయనుంది.
వీసీలకు చోటులేదు
వర్సిటీ నియామకాల కోసం కామన్ బోర్డులో విశ్వవిద్యాలయాల వీసీలకు ప్రభుత్వం చోటు కల్పించలేదు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూ హైదరాబాద్ వంటి విశ్వవిద్యాలయాల వీసీలను సభ్యులుగా నియమించకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోధన, బోధనేతర పోస్టులను భర్తీ చేసుకునే అధికారం ఇప్పటి వరకు వర్సిటీలకే ఉన్నది. అవి స్వయంప్రతిపత్తి కలిగిన విద్యాసంస్థలు. ఇప్పుడు వాటికి ఉన్న అధికారం తొలగించడంతోపాటు కామన్ బోర్డులో వీసీలను భాగస్వాములను చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతున్నది. వర్సిటీలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందా? లేదంటే నిర్వీర్యం చేయడానికి చేసిందా?అన్న అనుమానాలొస్తున్నాయి. కామన్ బోర్డులో వీసీలకు చోటు కల్పించాలన్న డిమాండ్లు వస్తున్నాయి.
క్రమబద్ధీకరణ తర్వాతే నోటిఫికేషన్లు ఇవ్వాలి
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులందర్నీ క్రమబద్ధీకరణ చేసిన తర్వాతే నోటిఫికేషన్లు జారీ చేయాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీ కాంట్రాక్టు టీచర్స్ అసోసియేషన్ (టీఆక్టా) జేఏసీ కన్వీనర్ శ్రీధర్‌కుమార్ లోధ్ డిమాండ్ చేశారు. వర్సిటీల్లో కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం 2015లో సర్క్యులర్ జారీ చేసిందని గుర్తు చేశారు.