Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు వీపీ సాను
నవతెలంగాణ-కొత్తగూడెం
విద్యారంగంలో మతోన్మాద విధానాలు దేశ భవిష్యత్తుకే ప్రమాదమని ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు వీపీ సాను అన్నారు. గురువారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక టీచర్స్ భవన్లో 'విద్యార్ధి రంగం-ప్రస్తుత పరిస్థితులు' అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు వీపీ సాను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు హాజరయ్యారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్రా వీరభద్రం అధ్యక్షతన జరిగిన సెమినార్లో విపి.సాను మాట్లాడుతూ.. విద్యారంగంలోకి ప్రమాదకర ఫాసిస్టు భావాజాలాన్ని చొప్పిస్తున్నారన్నారు. తమ భావాజాల వ్యాప్తికే నూతన విద్యా విధానాన్ని పరిచయం చేశారన్నారు. పాఠ్యపుస్తకాల్లో భగత్ సింగ్ వంటి స్వాతంత్రోద్యమ నాయకుల చరిత్రను తొలగించి, దేశ స్వాతంత్య్రానికి సంబంధంలేని వారి జీవిత చరిత్రను జోడిస్తున్నారన్నారని ఆరోపించారు. రక్షణ వ్యవస్థలో ప్రమాదకర కాంట్రాక్టు వ్యవస్థ ద్వారా దేశ భద్రతకే ప్రమాదం వాటిల్లుతుందని హెచ్చరించారు. మితిమీరిన జాతీయవాదాన్ని రెచ్చగొడుతూ తామే నిజమైన దేశభక్తులమని ప్రచారం చేస్తున్నారన్నారని విమర్శించారు. నిజమైన దేశభక్తులైతే దేశ సంపద ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, విమానయానం, రైల్వే, ఓడరేవులు ఎలా ప్రయివేటుపరం చేస్తారని ప్రశ్నించారు. నేషనల్ మానిటైజేషన్ పేరుతో దేశ ఆస్తులను బడా కార్పొరేట్లకు అప్పగిస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ ఆలోచన చేస్తోందన్నారు. అనంతరం నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమయినప్పటికీ పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ ఇంకా సిద్ధం చేయలేదన్నారు. పాఠ్యపుస్తకాలు ఎప్పటికి అందుతాయో కూడా తెలియదన్నారు. బడిబాట నామమాత్రంగా సాగుతోందని విమర్శించారు. 6 నుంచి 14 ఏండ్ల విద్యార్థుల్లో 100లో 44 మంది బడిబయటే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 15 నుంచి 19 ఏండ్ల విద్యార్థుల్లో 100లో 95 మంది బడిబయటే ఉన్నారన్నారు. తిరిగి విద్యార్థులను ప్రభుత్వ బడులకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక తల్లిదండ్రులు, విద్యార్థులు పాఠశాలలకు తాళాలు వేసి నిరసన తెలుపుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గార్లపాటి పవన్, జిల్లా ఉపాధ్యక్షులు నవీన్, అభిమిత్ర, జిల్లా కమిటీ సభ్యులు శైలజ, యశ్వంత్, కొత్తగూడెం డివిజన్ ఉపాధ్యక్షులు రామ్ చరణ్, జూలూరుపాడు మండల అధ్యక్షులు మంజుల, నందిని తదితరులు పాల్గొన్నారు.